ఎన్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే 10 నుంచి 15 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లోటువర్షపాతంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు కింద 24,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, ఈ పరిస్థితులు కొనసాగితే కేవలం 50 శాతం మాత్రమే పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. కుడి కాలువ ద్వారా మొదట్లో ఉన్న బూర్గుడ, రాజూర గ్రామాలకు మాత్రమే సాగు నీరందితే.. ఆయకట్టు చివరన ఉన్న పర్శనంబాల, కొండపెల్లి, రెబ్బెన, కాగజ్‌నగర్ ప్రాంతాలకు నీళ్లు చేరవు. గతంలోనే ఇలా జరిగి పంటలు ఎండిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్: జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో ఒకటైన వట్టివాగు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేక వెలవెలబోతోంది. నీటి విడుదల కోసం వరిసాగు చేసే ఆయకట్టు రైతులు పొలాలు దుక్కిదున్ని నార్లు పోసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఏటా జూన్ మొదటివారంలోనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు. ఈసారి జూలై వచ్చినా ప్రాజెక్టులోకి సరిపడా వరద చేరకపోవడం, నీటి విడుదల తేదీపై అధికారులు స్పష్టతనివ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 239.500 మీటర్లు కాగా, ప్రస్తుతం 235.650 మీటర్లుగా ఉంది. జలాశయం సామర్థ్యం 2.890 టీఎంసీల కాగా ప్రస్తుతం 1.538 టీఎంసీలు మాత్రమే ఉంది. జలాశయంలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో జీరో ఉంది. వర్షాలు రాకపోవడంతో జలాశయం సామర్థ్యంలో కేవలం సగమే నీటి నిల్వ ఉంది. వానాకాలం ఆయకట్టుకు సాగు నీరందించాలంటే సాధారణంగా 1.8 నుంచి 2 టీఎంసీల దాకా నీరు కావాలి. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడంతో జూన్‌తోపాటు ప్రస్తుతం జూలైలోనూ లోటు వర్షపాతం ఉంది. భారీ వర్షాలు లేక వరద నీరు చేరడం లేదు.
వరి సాగుకు రైతులు సిద్ధం
వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఇప్పటికీ అధికంగా పత్తి పంట సాగే చేపడుతున్నారు. ఆసిఫాబాద్ మండలం కొమ్ముగూడ, ఈదులవాడ, బూర్గుడ, రెబ్బెన మండలం కై రిగాం, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలం వంకులంలో రైతులు వరి పండిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతుల వరినార్లు పోసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జూలై రావడంతో అదును దాటితో పంట నష్టపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. నీటిని విడుదల చేయాలని ఇటీవల అధికారులకు వినతిపత్రాలు సైతం అందించారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు రూ.50లక్షల నిధులతో కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించారు. ప్రధాన కాలువతోపాటు ఉప కాలువల్లో పూడిక, చెత్తాచెదారం, గడ్డి తొలగింపు పనులు కొనసాగుతున్నా గడువులోగా పూర్తికావడం అనుమానంగా మారింది.
ఇన్‌ఫ్లో జీరో
24,500 ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యంగా 1998లో రూ.120 కోట్లతో వట్టివాగు ప్రాజెక్టు నిర్మించారు. 21.6 కిలోమీటర్ల మేర కుడికాలువ, ఏడు కిలోమీటర్ల మేర కుడి కాలువ ఉంది. వీటి కింద 19 చిన్న కాలువలు ఉన్నాయి. అయితే నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంతో నిర్మాణ దశలోనే గండ్లు పడ్డాయి. 2001లో రూ.9 కోట్లు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు ప్రాజెక్టు పూర్తయి దశాబ్దాలు గడుస్తున్నా ఆధునికీకరణపై దృష్టి సారించడం లేదు. ఏటా వర్షాకాలంలో గేట్లు పైకి, కిందికి కదిలేందుకు మొరాయిస్తున్నాయి.
నారు పోసేందుకు సిద్ధం
వట్టివాగు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి ఐదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను. వరి నారు వేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఏటా అధికారులు ఆలస్యంగా నీటిని విడదల చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. సకాలంలో కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయాలి.
– మామిడి నరేశ్, ఈదులవాడ
సరిపడా నీరు లేదు
వట్టివాగు జలాశయం సామర్థ్యం 2.890 టీఎంసీల కాగా ప్రస్తుతం 1.538 టీఎంసీలు మాత్రమే ఉంది. 53 శాతం నీరు ఉంది. వర్షాభావంతో ప్రాజెక్టులో నీరు చేరక సగం ఆయకట్టుకు మాత్రమే సాగునీరందే అవకాశం ఉంది. కాలువల ద్వారా నీటి విడుదలకు ఎస్‌ఈ అనుమతి కోరాం. ఈ ఏడాది కూడా మరమ్మతులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.
– పవన్‌కళ్యాణ్, వట్టివాగు ప్రాజెక్టు ఏఈ


