ఆసిఫాబాద్‌రూరల్: హాస్పిటల్, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బుధవారం కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. జీవో నం.60 ప్రకారం పీఎఫ్, ఈఎస్‌ఐ మినహాయించగా రూ.13,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ నాలుగేళ్ల నుంచి కేవలం రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిరక్ష్యంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సురేశ్, దివాకర్, మమత, మాధవి, జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు.


