చకచకా ‘శక్తి భవనం’ | - | Sakshi
Sakshi News home page

చకచకా ‘శక్తి భవనం’

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణం సమావేశాల నిర్వహణకు వసతుల కల్పన ఉత్పత్తులు విక్రయాల కేంద్రంగానూ వినియోగం

ఆసిఫాబాద్‌అర్బన్‌: మహిళల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను అన్ని విధాలుగా ప్రో త్సహిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాల మంజూరు, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సమాఖ్యను వ్యాపారాల్లో ప్రోత్సహించ డం వంటి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో మహిళా సంఘా కోసం రూ.6 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మి స్తోంది. సమన్వయ కర్తలు, సభ్యులకు శిక్షణ, జిల్లాస్థాయి సమావేశాల నిర్వహణకు ఈ భవనం వేదికగా నిలువనుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. ఇటీవల కలెక్టర్‌ కె.హరిత అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు.

నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణ

జిల్లా కేంద్రంలో గ్రామ, మండల స్థాయి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రాథమిక సభ్యులతో జిల్లాస్థాయి సమావేశాలకు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని వినియోగించనున్నారు. విస్తృత సమావేశాలకు విశాలమైన హాల్‌తోపాటు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు సైతం ప్రత్యేక హాళ్లు నిర్మిస్తున్నారు. జిల్లా సమాఖ్య కార్యకలాపాలను సైతం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. వీటితోపాటు సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీవోఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నైసుణ్య శిక్షణ కార్యక్రమాలను సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇందిర మహిళా శక్తి భవనం కేంద్రంగా మారనుంది.

8,236 మహిళా సంఘాలు

జిల్లా వ్యాప్తంగా 8,236 మహిళా స్వయం సహాయ క సంఘాలు ఉండగా, ఇందులో 94,569 మంది స భ్యులుగా కొనసాగుతున్నాయి. మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్రనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్నారు. మ రింత ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ఇందిరా మహిళా శక్తి భవనాలను వేదికలుగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. నిపుణులతో పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు వీలుగా నిత్యం సమావేశాలు నిర్వహించనున్నారు.

మహిళలకు ప్రయోజనం

జిల్లా కేంద్రంలో ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణంతో మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. సమావేశాల నిర్వహణ, వృత్తి నైపుణ్య శిక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. – శ్రీలక్ష్మి, మహిళా సంఘం నిర్వాహకురాలు, ఆసిఫాబాద్‌

మూడు నెలల్లో పూర్తి

మహిళా సంఘాల సభ్యుల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం.

– దత్తారావు, డీఆర్‌డీవో

Advertisement
 
Advertisement
Advertisement