దిందాలో ‘పోడు’ ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

దిందాలో ‘పోడు’ ఉద్రిక్తత

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

● కాగజ్‌నగర్‌ ఫారెస్టు కార్యాలయానికి రైతుల తరలింపు ● చట్టాలపై అవగాహన కల్పించిన అటవీ అధికారులు

చింతలమానెపల్లి: మండలంలోని దిందా అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖర్జెల్లి రేంజ్‌ పరిధిలోని దిందా అటవీ ప్రాంతంలో ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్లతో చదును పనులు చేపట్టగా, దిందా గ్రామానికి చెందిన పలువురు పోడు రైతులు అడ్డుకున్నారు. ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. మహిళలు, రైతులు ట్రాక్టర్లకు అడ్డుగా బైఠాయించారు. దీంతో అటవీ సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. చింతలమానెపల్లి ఎస్సై కమలాకర్‌, కౌటాల సీఐ సంతోష్‌ కుమార్‌ ఘటనా స్థలికి చేరుకున్నారు. సముదాయించినా వినకపోవడంతో అటవీశాఖ వాహనాల్లో కాగజ్‌నగర్‌ డివిజన్‌ కార్యాలయానికి తరలించారు. అవగాహన కల్పించిన అనంతరం రాత్రి వరకు వారిని వదిలిపెట్టారు. కాగా, డీఎస్పీ వహీదుద్దీన్‌ దిందాలోని ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

‘పోడు’ సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి – ఎఫ్‌డీవో అప్పయ్య

కాగజ్‌నగర్‌టౌన్‌: అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా పోడు సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎఫ్‌డీవో అప్పయ్య తెలిపారు. ఖర్జెల్లి అటవీ డివిజన్‌ పరిధిలోని దిందా గ్రామ పంచాయతీలో పోడు వ్యవసాయం చేస్తున్న 25 మంది పోడు రైతులను మంగళవారం కాగజ్‌నగర్‌ డివిజన్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారికి పోడు వ్యవసాయం, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎఫ్‌డీవో అప్పయ్య మాట్లాడుతూ దిందా ఫారెస్ట్‌లో 1600 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఒక్కో కుటుంబం 30 నుంచి 50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న 800 ఎకరాల ఫారెస్ట్‌ భూముల్లో ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి ప్లాంటేషన్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూనే, కొత్తగా అడవులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో సుభాష్‌, బండెపల్లి పోడు రైతులు దన్నూరి లక్ష్మయ్య, హన్మంతు, బక్కయ్య, అంకులు, డోకె అంకులు, సురేష్‌, తిరుపతి, కమలాబాయి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement