● గృహ అవసరాల సిలిండర్‌పై రూ.29 పెంపు ● మూడు నెలల్లో రెండుసార్లు పెరుగుదల ● ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు ● జిల్లా ప్రజలపై రూ.27లక్షల అదనపు భారం | - | Sakshi
Sakshi News home page

● గృహ అవసరాల సిలిండర్‌పై రూ.29 పెంపు ● మూడు నెలల్లో రెండుసార్లు పెరుగుదల ● ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు ● జిల్లా ప్రజలపై రూ.27లక్షల అదనపు భారం

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

● గృహ అవసరాల సిలిండర్‌పై రూ.29 పెంపు ● మూడు నెలల్లో రెండుసార్లు పెరుగుదల ● ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు ● జిల్లా ప్రజలపై రూ.27లక్షల అదనపు భారం

ఆసిఫాబాద్‌: గ్యాస్‌ సిలిండర్ల ధర మరోసారి పెరి గింది. ప్రతీ సిలిండర్‌పై రూ.29 పెంచినట్లు ప్రకటించారు. కొత్త ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావం, హార్మోజ్‌ జలసంధి వద్ద ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇంధనం సరఫరాలో అంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పెట్రో, వంట నూనెల ధరలు మండుతున్నాయి. వంటనూనెలు లీటర్‌కు రూ.10 వరకు పెరిగాయి. మూడు నెలలతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో లీటర్‌కు రూ.161 నుంచి రూ.171 వరకు చేరాయి. ఈ పెంపు జిల్లాలోని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు గిరిజనులకు మోయలేని భారంగా మారింది.

జిల్లా ప్రజలపై అదనపు భారం

జిల్లాలో 12 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా, సుమారు 1.40 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు, 28 వేలు డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేల కు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్‌ కనెక్షన్లు, 600 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. మూడు నెలల క్రితం గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.60 పెరగడంతో రూ.982 కు చేరింది. తాజాగా మరోసారి రూ.29 పెంచడంతో రూ.1011కు చేరింది. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.27 లక్షల అదనపు భారం పడుతుంది.

నిలకడ లేకుండా..

గతంలో గ్యాస్‌ ధరలు నిలకడగా ఉండేవి. కానీ రెండేళ్లుగా ఒడిదొడులకు లోనవుతున్నాయి. 2022 మా ర్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్‌ సిలిండడర్‌ ధర రూ. 875 ఉండగా 2023 జనవరిలో రూ.976కు చేరింది. ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.50 పెంచారు. జూన్‌లో మళ్లీ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో రూ.1019 నుంచి రూ.1072కి చేరింది. గత ఆగస్టులో వంట గ్యాస్‌ రూ.1172 ధర ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ ఊరట కలిగించింది. మరోసారి 2024 మార్చిలో సిలిండర్‌పై రూ. 100 తగ్గించింది. మళ్లీ గతేడాది సిలిండర్‌పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్‌ ధర రూ.922కు చేరింది. గత మార్చి 7న సిలిండర్‌పై రూ.60 పెరిగి రూ.982కు చేరింది. తాజాగా సిలిండర్‌పై రూ.29 పెంచడంతో రూ.1011 చేరింది. అంతేకాక డెలివరీ బాయ్స్‌ రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఒక్కో సిలిండర్‌కు రూ.1061 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

టిఫిన్‌, టీ రేట్లకు రెక్కలు

గృహ అవసరాల సిలిండర్‌తోపాటు వాణిజ్య సిలిండర్ల ధరల్లో కూడా నిలకడ ఉండటం లేదు. గత మార్చి 7న కమర్షియల్‌ 19 కేజీల సిలిండర్‌ ధర రూ.115 పెరగడంతో రూ.2,144కు చేరింది. కమర్షి యల్‌ సిలిండర్‌ ధర పెరగడంతో జిల్లా కేంద్రంలోని హోటళ్ల యజమానులు సైతం అమాంతం రేట్లు పెంచారు. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లపై అదనంగా రూ.10 పెంచారు. ప్లేట్‌ ధర రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50కి చేరింది. అలాగే టీ సైతం రూ.10 నుంచి రూ.13కి పెంచి అమ్ముతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement