చీకట్లో డబుల్‌ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

చీకట్లో డబుల్‌ ఇళ్లు

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

నూతన మీటర్లు అమర్చని అధికారులు తాగునీటి నల్లాలు కూడా బిగించని వైనం ప్రహరీ లేకపోవడంతో భద్రతపై లబ్ధిదారుల్లో ఆందోళన మట్టిరోడ్డుతో వర్షాకాలంలో ఇబ్బందులే..

కాగజ్‌నగర్‌టౌన్‌: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చారిగాం సమీపంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు గత నెల 8న ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే నెలరోజులు కావొస్తున్నా లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. సరైన వసతులు లేకపోవడంతో ఇళ్లలో ఉండేందుకు సుముఖత చూపడం లేదు. సరైన రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో వర్షాలకు ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంది. కాలనీల్లో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. రాత్రిపూట చీకటి అలుముకుంటుంది. అంతేకాకుండా ఊరు చివరన డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఉండగా కనీసం రక్షణగా ప్రహరీ కూడా నిర్మించలేదు. రాత్రిపూట భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి అద్దెలు కట్టలేక ఎదురుచూసిన వారి సొంతింటి కల నెరవేరినా ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.

సందిగ్ధత తొలగేనా..?

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చారిగాం రోడ్‌ సమీపంలో 12 బ్లాక్‌ల్లో 288 డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 24 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 248 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించి ప్రొసీడింగ్‌లు కూడా అందించారు. మరో 40 ఇళ్లు కేటాయించాల్సి ఉంది. ఇళ్లలో కరెంట్‌ లేకపోవడంతో చీకట్లో ఎలా ఉండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నుంచి పైపులైను వేసినా నీళ్లు సరఫరా కావడం లేదు. వేసవిలో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు నీరు అందుబాటులో లేదు. అయితే ప్రభుత్వమే ఉచితంగా మీటర్లు అందిస్తుందని లబ్ధిదారులు ఎదురుచూస్తుండగా, అధికారులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. దీనిపై స్పష్టత వస్తేనే లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసే అవకాశం కనిపిస్తుంది.

సౌకర్యాలు కల్పించాలి

డబుల్‌ బెడ్రూం ఇంటిని కేటాయించి ప్రొసీడింగ్‌ ఇచ్చి నెల రోజులవుతుంది. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వెళ్లలేదు. కరెంట్‌ మీటర్‌, మంచినీళ్లు లేవు. సరైన దారి కూడా లేదు. అందరూ ఇళ్ల చూసి వస్తున్నా ఎవరూ నివాసం ఉండటం లేదు. అధికారులు మీటర్ల బిగింపుపై స్పష్టత ఇవ్వాలి.

– బండయ్య, లబ్ధిదారుడు, కాగజ్‌నగర్‌

ఎలా ఉండాలి

కొన్నేళ్లపాటు కాగజ్‌నగర్‌లో కిరాయికి ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. డబుల్‌ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. తీరా అక్కడి వెళ్లి చూస్తే సరైన వసతులు లేవు. కరెంటు, నీళ్లు లేకుంటే కుటుంబంతో ఎలా ఉండాలి.

– యశోద, లబ్ధిదారు, కాగజ్‌నగర్‌

పనులు పూర్తయ్యాయి

డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులకు అప్పగించాం. 248 మంది లబ్ధిదారులకు కేటాయించారు. వాటర్‌ ట్యాంక్‌లు, నల్లాలు కూడా ఏర్పాటు చేశాం. విద్యుత్‌ స్తంభాలనూ ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు మీటర్లకు దరఖాస్తు చేసుకుని బిగించుకోవాలి.

– ప్రకాశ్‌రావు, హౌసింగ్‌ పీడీ

Advertisement
 
Advertisement
Advertisement