ప్రవేశాల కోసం గ్రామాల్లో అధ్యాపకుల విస్తృత ప్రచారం.. ఒక్కో కాలేజీలో 200 మందిని చేర్చుకునేలా కసరత్తు ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన
కెరమెరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల వేట ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో తిరుగుతూ పదో తరగతి పాసైన విద్యార్థులను గుర్తిస్తున్నారు. ఈ నెల 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కాగా, ప్రతీ కళాశాలలో కనీసం 150 నుంచి 200 మంది మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్చుకునేలా కసరత్తు చేస్తున్నారు. గ్రూపులుగా తిరుగుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇంటింటి ప్రచారం
జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్‌లో 2,400 మంది, సెకండియర్‌లో 2,200 మంది విద్యార్థులను చేర్చుకోవా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 614 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. సౌకర్యాలపై ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజుల చెల్లించే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లోనే మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఏటా జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉత్తమ ఫలితాలు సాధించడం సానుకూలంశంగా మారింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్‌పాస్ సౌకర్యంతోపాటు ఉచిత అడ్మిషన్, పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. ఫలితాలను మెరుగుపర్చేందుకు కళాశాల ప్రారంభం నుంచే స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వీక్లీ, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.
ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్
ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మా త్రమే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఎంపీసీ, బైపీసీ సెకండియర్‌లో 30 మార్కుల ప్రాక్టికల్స్ ఉండగా, ఇక నుంచి మొదట సంవత్సరంలో 15, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది.
జిల్లా వివరాలు


