రెబ్బెన: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్ అన్నారు. శనివారం మండలంలోని తుంగెడలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ నిబంధనలు, మహిళాలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్ వంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం షీ టీంలు, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో డయల్ 100, డయల్ 112 నంబర్లను సంప్రదించి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1030 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలగాణి బుచ్చక్క, ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై వెంటకరమణ, డిప్యూటీ తహసీల్దార్ లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు.


