కెరమెరి: ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. స్వగ్రామంలో దసరా పండుగ చేసుకున్నంత సంబురం కొత్తగూడలో కనిపిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, స్థానిక సర్పంచ్ మడావి శాంతాబాయితో కలిసి లబ్ధిదారులు సిడా కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. గ్రామ పటేల్ సిడాం భీంరావ్ కుటుంబానికి సీఎం నూతన దుస్తులు అందించారు. ఆత్రం పోసుబాయి ఇంట్లో ఇప్పపువ్వు లడ్డూ ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు అనేక దశల్లో కొనసాగుతున్నాయని, ఇప్పటికీ వాటికి బిల్లులు అందడం లేదన్నారు. త్వరగా బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ నితిక పంత్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.


