పోరుగడ్డకు సీఎం | - | Sakshi
Sakshi News home page

పోరుగడ్డకు సీఎం

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

నేడు జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.

పర్యటన ఇలా..

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హెలిక్యాప్టర్‌ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్‌నగర్‌కు చేరుకుంటారు. విశ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

భారీగా జనసమీకరణ..

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు భారీగా జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు.

1,825 మందితో బందోబస్తు

సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ఆర్‌ఐలు, 157 మంది ఏఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, డబ్ల్యూఎస్సైలు, 200 మంది ఏఎస్సైలు, 829 మంది కానిస్టేబు ళ్లు, 43 మంది మహిళా పోలీస్‌ సిబ్బంది, 328 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారు. వీరితోపాటు తొమ్మిది ప్రత్యేక పార్టీలు, రెండు రోప్‌ పార్టీలు, 28 యాక్సెస్‌ కంట్రోల్‌ బృందాలు, 10 బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను మోహరించనున్నారు. మొత్తం 1,825 మంది విధులు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆసిఫాబాద్‌: సీఎం పర్యటనలో భాగంగా జిల్లాలో రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విద్యుత్‌ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్‌ ప్రాజెక్టు, మున్సిపల్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రవీంద్రనగర్‌ క్యాంపు నం.2 గ్రామంలో రూ.56.55 కోట్లతో 132/33 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రం, రెబ్బెన మండలం నంబాలలో రూ.6 కోట్లతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే చింతలమానెపల్లిలో రూ.4.22 కోట్లతో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌, రూ.2.98 కోట్లతో కౌటాల మండలం గుడ్లబోరి, రూ.3.08 కోట్లతో కాగజ్‌నగర్‌లో, రూ.2.89 కోట్లతో సిర్పూర్‌– టి మండలం చింతకుంటలో, రూ.2.72 కోట్లతో కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌లో ఏర్పాటు చేసే 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్‌, రూ.18.7 కోట్లతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఏర్పాట్లు పరిశీలన

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొత్తగూడతోపాటు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్‌, కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితిక పంత్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్‌ వన్‌ ఐజీ చంద్రశేఖర్‌ పరిశీలించారు. హెలిప్యాడ్‌ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్‌ హరిత, ఎస్పీలు నితిక పంత్‌, అఖిల్‌ మహాజన్‌కు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement