కెరమెరి: ఆదిమ గిరిజనులైన కొలాం తెగల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నుగూడ గ్రామాన్ని సందర్శించడంతోపాటు లక్మాపూర్, అనార్‌పల్లి వంతెనలను పరిశీలించారు. గిరిజనుల కోసం రూ.3 లక్షల కోట్లు వెచ్చించినట్లు సీఎం చెబుతున్నా అవి వారి దరికి చేరడం లేదన్నారు. ఇప్పటికీ ఆదివాసీ గూడేలకు రోడ్డు, తాగునీరు, పక్కా గృహాల సౌకర్యాలు లేవని స్పష్టం చేశారు. లక్మాపూర్, అనార్‌పల్లి వంతెనల నిర్మాణ పనులు ఏళ్లుగా అసంపూర్తిగా ఉందని, సుమారు 30 గ్రామాల ప్రజలు వానాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయన వెంట పీవీటీజీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వసంత్‌రావు, నాయకులు రాథోడ్ రమేశ్, ఉత్తం నాయక్, బలిరాం తదితరులు ఉన్నారు.


