జూన్ 1న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు శ్రీకారం జిల్లా నుంచే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం నలుగురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేత
రెబ్బెన: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత గృహాల నిర్మాణాలు కొనసాగుతుండగా, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు జిల్లాలోని రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద జూన్ 1న నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ వేదికగా మారనుంది. ఈ వేదిక మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నారు.
మొదటి విడతలో ఇలా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం అర్హులైన ప్రజల నుంచి పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి అర్హులకు ఇళ్లు మంజూరు చేశారు. మొదటి విడతలో అనర్హులకు సైతం ఇళ్లు కేటాయించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. కానీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. మొదటి విడతలో జిల్లాలో 8,419 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 386 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 243 గృహ ప్రవేశాలు సైతం పూర్తి చేశారు. 2,204 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు.. లెంటల్ వరకు 1,575, బేస్‌మెంట్ లెవల్ వరకు 3,233 ఇళ్లు పూర్తయ్యాయి. మిగితా ఇళ్లు ప్రారంభించలేదు. చాలామంది నిరుపేదలు కావడం, ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిర్మాణాలు ప్రారంభించలేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు చేపడుతున్నారు.
సిద్ధం కాని అర్హుల జాబితా
జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రెండో విడత ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే జిల్లాలో రెండోవిడత ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల జాబితా ఇంకా సిద్ధం కాలేదు. ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేసి జూన్ 1న సీఎం చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందించనున్నారు. ఆపై ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎల్ 1 లిస్టులో నుంచి రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే మొదటి విడతలో అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకు ఇళ్లను మంజూరు చేశారనే ఆరోపణలు రావడంతో.. రెండో విడత జాబితాపై ఆసక్తి నెలకొంది.
నిబంధనలకు అనుగుణంగా ఎంపిక
జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమవుతుంది. నాలుగు మండలాల నుంచి నలుగురు చొప్పున ఎంపిక చేసి ముందుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్ పత్రాలు అందిస్తాం. ఆపై ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేస్తాం. ఎల్ 1 లిస్టులో నుంచే నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– ప్రకాశ్‌రావు, హౌసింగ్ శాఖ పీడీ


