నేటి నుంచి దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రవేశాలు పొందాలని అధికారుల సూచన
కాగజ్‌నగర్‌టౌన్: డిగ్రీ అంటే ప్రైవేటు కాలేజీలే అనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆధునిక కోర్సులు, డిజిటల్ క్లాస్‌రూంలు, ఉచిత లైబ్రరీలు అందుబాటులోకి వచ్చాయి. ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా అందిస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్లలో భాగంగా ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. ఇంకా సీటు రాని వారు, మొదటి రెండు విడతల్లో దరఖాస్తు చేసుకోని వారి కోసం ఈ నెల 31 నుంచి జూన్ 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి.
కంప్యూటర్ కోర్సులకు డిమాండ్
ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు గ్రామాల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం బీఎస్సీ(కంప్యూటర్స్), బీకాం(కంప్యూటర్స్) కోర్సులకు డిమాండ్ ఉంది. ఈ కోర్సులతో ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించవచ్చు. అలాగే బీబీఏ/బీకాం కోర్సులతో బ్యాంకింగ్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. సివిల్స్, గ్రూప్– 1, గ్రూప్– 2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కోర్సులు బాటలు వేస్తున్నాయి. పరిమితం కాకుండా కాలానికి అనుగుణంగా సరైన కోర్సును ఎంచుకుంటే డిగ్రీ పూర్తయ్యే సరికే మంచి జీతంతో ఉద్యోగం సాధించవచ్చని అధ్యాపకులు పేర్కొన్నారు.
ప్రైవేటును మించిన వసతులు
జిల్లాలో ఏడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటికీ దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లోని గురుకుల డిగ్రీ కళాశాల, వాంకిడి డిగ్రీ కాలేజీలో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలు సాధించిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. డిజిటల్ క్లాస్ రూములు, అధునాతన ల్యాబ్‌లు, ఉచిత గ్రంథాలయ సౌకర్యం కల్పిస్తున్నారు. చదువుతోపాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
మే 31 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మూడో విడత మొదలవుతుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ కాలేజీలు భరోసా కల్పిస్తున్నాయి. అనుమానాల నివృత్తికి కాగజ్‌నగర్‌లోని కాలేజీలో సంప్రదించాలి.
– శ్రీదేవి, ప్రిన్సిపాల్,
కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల


