రెబ్బెన: సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడామెలకువలు నేర్చుకున్న విద్యార్థులు నిత్యం సాధన చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేశారు. జీఎం మాట్లాడుతూ చిన్నారులు మొబైళ్లకు ఎంత దూరంగా ఉంటే.. క్రీడలు, చదువులో అంతగా రాణిస్తారని తెలిపారు. క్రీడానైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఉజ్వల్‌కుమార్ బెహరా, పర్సనల్ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్‌అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


