నత్త నడకే..! | - | Sakshi
Sakshi News home page

నత్త నడకే..!

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే పనులు ప్రతిపాదనల మేరకు అందని నిధులు ఇంకా పూర్తి కాని మూడోలైన్‌ నిర్మాణం ఆదిలాబాద్‌ లైన్‌కు మోక్షమెప్పుడో! వసతులు పెరగక ప్రయాణికుల పాట్లు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉత్తర, దక్షిణ భారత దేశానికి కీలక రైలు మార్గమైన కాజిపేట–బల్షార్షా సెక్షన్‌ పరిధిలో పెండింగ్‌ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది. దక్షక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఈ లైన్‌కు ఏటా రూ.కోట్లలో ప్రతిపాదిస్తున్నారు. అయితే, నిధుల మంజూరు నుంచి ఖర్చు వరకు ఏళ్లు పడుతోంది. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో అనేక పనులను ప్రతిపాదించింది. అయితే, ఈ పెండింగ్‌ పనులు ఎన్ని ఏళ్లకు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో మూడో లైన్‌ పనులు పూర్తయ్యేందుకు ఏళ్లు పట్టింది. మరోవైపు తాజాగా నాలుగో లైన్‌ ప్రతిపాదనలో ఉంది. ఈ ఏడాది 2026–27లో ప్రతిపాదిత రైల్వే నిధుల సమగ్ర నివేదికను పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా ప్రతిపాదించినవే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గత రెండు బడ్జెట్‌లలోనూ కాజిపేట–బల్లార్షా సెక్షన్‌లో 234 కిలోమీటర్లు నాలుగో లైన్‌ సర్వే కోసం నిధులు మంజూరు చేశారు. అయితే, ఇప్పటికీ మూడో లైన్‌ పనులే అక్కడక్కడా పూర్తి కాలేదు. ఇంకా 4.37 కిలోమీటర్ల నిడివి గల మంచిర్యాల–పెద్దంపేట మూడోలైన్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నాలుగో లైన్‌ పనులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, యూపీ, బీహార్‌, ఢిల్లీ, కశ్మీర్‌ వరకు, ఇటు చైన్నె వరకు రాకపోకలు సాగిస్తుంటారు. మంచిర్యాల, రామకృష్ణాపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి, రేచ్నీ రోడ్‌, ఆసిఫాబాద్‌ రోడ్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ (టీ) వరకు అటు మహారాష్ట్రలోని బల్షార్షా సెక్షన్‌ వరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రద్దీకి తగినట్లు నూతనంగా రైళ్లు నడపాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోంది.

ఏళ్లుగా వంతెనలు లేక..

పెరుగుతున్న రద్దీకి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజువారీగా రైల్వేస్టేషన్ల నుంచి రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. అంతకుమించి గూడ్స్‌తో బొగ్గు, సిమెంట్‌ ఇతర సరుకుల రవాణాతో రూ.కోట్లలోనే ఆదాయం సమకూరుతోంది. అయితే, తగిన సౌకర్యాల కల్పనలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలు (ఆర్‌యూబీ), ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు (ఎఫ్‌వోబీ) నిర్మించాల్సి ఉంది. ఆర్‌యూబీలు చూస్తే రాళ్లపేట–బెల్లంపల్లి, రేపల్లెవాడ, ఆసిఫాబాద్‌ స్టేషన్లు, మందమర్రి.. మంచిర్యాల మధ్య రోడ్‌ అండర్‌ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఇక రాళ్లపేట–కాగజ్‌నగర్‌ మధ్య ఆర్‌యూబీ, కాగజ్‌నగర్‌–రాళ్లపేట మధ్య ఉన్న వంతెనపై రెండు అదనపు గడ్డర్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. కాగజ్‌నగర్‌ స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంచిర్యాల రైల్వేస్టేషన్‌ అమృత్‌ పథకం కింద ఎంపికై నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ఆదిలాబాద్‌ లైన్‌కు ఎన్నేళ్లో?

తూర్పు, పశ్చిమ జిల్లాలకు ఇప్పటికీ రైల్వే మార్గం అందుబాటులో లేదు. కోల్‌బెల్ట్‌ను ఉమ్మడి జిల్లా పరిధి ఏజెన్సీ గూడేల మీదుగా రైల్వే మార్గం కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. అయితే, ఈ మార్గం ఆచరణకు ఎదురుచూడాల్సి వస్తోంది. మంచిర్యాల వయా ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్‌ వరకు 186 కిలో మీటర్లతో కొత్త మార్గం ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు కనీసం సర్వే కూడా మొదలు కాలేదు. గత రెండేళ్లుగా బడ్జెట్‌లో రూ.100.28కోట్లు ప్రతిపాదించినా ముందుకు కదలడం లేదు. దీంతో మంచిర్యాల–ఆదిలాబాద్‌ లైన్‌ ఎన్నేళ్లకు అందుబాటులోకి వస్తుందోననే అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement