శ్రీరాంపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్‌టీపీపీ)లో నూతనంగా చేపట్టిన 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి ఆదేశించారు. ప్లాంట్‌ను శుక్రవారం సాయంత్రం సందర్శించారు. యూనిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. సేఫ్టీ కంట్రోల్ రూంను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణంలో భాగస్వాములైన బీహెచ్‌ఈఎల్, కేపీసీ, పవర్‌మెక్ కంపెనీల అధికారులకు నిర్మాణ పనులపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. మెయిన్ కంట్రోల్ రూంలో రెండు యూనిట్ల ద్వారా జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ ప్రొడక్షన్ పనితీరు వివరాలను ఇంజినీర్లు ఆయనకు వివరించారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట కంపెనీ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పీపీ), ఎం.తిరుమలరావు (ఈఅండ్‌ఎం), ఈడీ కోల్‌మూవ్‌మెంట్ వెంకన్న జాదవ్, ఎస్‌టీపీపీ సీహెచ్ చిరంజీవులు, జీఎం నరసింహారావు, జీఎం (పీసీఎస్) మదన్మోహన్‌రెడ్డి, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ, డీజీఎంలు వీరబ్రహ్మం, సంతోష్‌కుమార్, కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


