నకిలీ విత్తు.. | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తు..

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

● రెబ్బెన మండలం కొమురవెల్లికి చెందిన గజ్జల సూర్యకాంత్‌, అతడి స్నేహితులైన జక్కులపల్లికి చెందిన ధోని రాజేశ్‌, కొమురవెల్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీనివాస్‌ వద్ద నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానిక రైతులకు విక్రయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏప్రిల్‌ 28న సూర్యకాంత్‌ వద్ద నుంచి రూ.4.37 లక్షల విలువైన 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ● ఆసిఫాబాద్‌ పట్టణ సమీపంలో ఏప్రిల్‌ 15న పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మంచిర్యాల జిల్లా తాండూర్‌కు చెందిన వ్యాపారి రాచర్ల మహేశ్‌, సాయికిరణ్‌ కారులో తరలిస్తున్న 80కిలోల నకలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. విచారణ అనంతరం మహేశ్‌ ఇంటి మరో 5.70 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.27 లక్షలు ఉంటుందని, గుజరాత్‌ నుంచి తెచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ● ఈ నెల 22న సిర్పూర్‌(యు) పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల్లో సిర్పూర్‌(యు) మండలంలో 6.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ● దహెగాం మండలంలోని కోత్మీర్‌ గ్రామంలో బుధవారం మైదం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో పది కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు అక్రమ రవాణా.. దిగుబడి ఆశచూపి అన్నదాతలకు అంటగడుతున్న అక్రమార్కులు సీజన్‌కు ముందే జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

కావొద్దు చిత్తు

కౌటాల: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు దున్ని తొలకరి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమార్కులు వారికి అధిక దిగుబడి ఆశచూపి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. పల్లెల్లో దళారులను ఏర్పాటు చేసుకుని ప్యాకెట్లు, లూజు విత్తనాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఏటా వానాకాలంలో అత్యధికంగా 3.50 లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుని దళారులు కొన్నేళ్లుగా పత్తి విత్తనాల నకిలీ దందా మొదలుపెట్టారు. గడిచిన రెండు నెలల్లోనే రూ.లక్షల విలువైన క్వింటాళ్ల కొద్దీ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.

సీజన్‌కు ముందే..

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దళారులు వానాకాలం సీజన్‌కు ముందే నకిలీ విత్తనాలను జిల్లాకు సరఫరా చేస్తున్నారు. రెబ్బెన, సిర్పూర్‌(యు), వాంకిడి, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌(టి) తదితర మండలాల్లో సబ్‌ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందును ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టులు, లారీల్లో జిల్లాకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గోదాంలను ఏర్పాటు చేసుకుని నేరుగా కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్‌(టి) మండలాలకు వార్దా, ప్రాణహిత, పెన్‌గంగ నదుల మీదుగా గోనె సంచుల్లోనూ సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సబ్‌ ఏజెంట్లకు అందిస్తున్నారు. భారీగా దందా సాగుతున్నా చిన్నమొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్న వారిని మినహా అసలు సూత్రధారులను అధికారులు పట్టుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల నమోదైన కేసులు

బీజీ– 1, 2 హైబ్రీడ్‌ విత్తనాలకు అనుమతులు ఉండగా, భూసారం తీవ్రంగా దెబ్బతినడం, వాతావరణ కాలుష్యం నేపథ్యంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు బీజీ– 3 రకాలపై నిషేధం విధించారు. వీటినే దళారులు దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉండదని, అధిక దిగుబడి వస్తుందని రైతులను నమ్మిస్తూ అంటగడుతున్నారు. ఇలా సీజన్‌ ప్రారంభానికి ముందే జిల్లాలో పలుచోట్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement