కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీలకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. నూతన పాలకవర్గాలు కొలువు దీరడంతో పట్టణాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ మేరకు పురపాలక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేసింది. 2025 జనవరి 27 నుంచి 2026 ఫిబ్రవరి వరకు బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. 15వ ఆర్థిక సంఘం బకాయిలు, నూతన ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆగిపోయింది. టీయూఎఫ్‌ఐడీసీ, యూఐడీఎఫ్ నిధులు మంజూరైనా కార్యాలయాల నిర్వహణ, పౌర సేవలకు వినియోగించే అవకాశం లేకపోవడంతో కేవలం ఆస్తిపన్ను, తదితర ఆదాయాలే దిక్కయ్యాయి.
నిధుల మంజూరు ఇలా..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కు రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా మే, జూ న్ రెండు నెలల మ్యాచింగ్ గ్రాంటు రూపేణ ఇవ్వాల్సిన నిధులను ఆయా సంబంధిత బ్యాంకు ఖాతా ల్లో జమ చేశారు. కాగజ్‌నగర్‌కు రూ.82,52,705, ఆసిఫాబాద్‌కు రూ.36,00,950 విడుదలయ్యాయి. ప్రత్యేక ప్రతిపాదనలను సమర్పించి నిధులు అవసరాలకు వినియోగించుకోవాలని ఆర్థిక సంఘం సూచించింది. ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను రిజర్వు ఉంచాలి. వేతనాల ఖర్చులు మినహాయించి నిధులు అందుబాటులో ఉంటే ప్రజామరుగుదొడ్ల నిర్వహణ, నీటి శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి, మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు, డంపింగ్ యార్డులు, ప్రహరీలు, సిబ్బంది క్వార్టర్లు, కమ్యూనిటీ వేదికలు, విద్యుత్, నీటి సదుపాయాలు, పరికరాల కొనుగోలు ప్రక్రియలో మున్సిపల్ వాటా చెల్లింపులకు సైతం వాడుకోవచ్చు. వీటి కంటే అత్యవసరమైన పనులు చేపట్టాల్సి ఉంటే మాత్రం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రతిపాదనలను సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది.
మార్గదర్శకాల మేరకు ఖర్చు
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. నిధులను పారదర్శకంగా, ప్రభుత్వ మార్గాదర్శకాల మేరకు ఖర్చు చేస్తాం. మున్సిపాలిటీల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
– తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్


