రూ.50 దాటిన టమాటా రూ.వందకు చేరువలో ఇతర కూరగాయలు జిల్లాలో సాగు లేక పెరుగుతున్న రేట్లు వానాకాలం, యాసంగి కలిపి 8,400 ఎకరాల్లోనే..
వాంకిడి: మండుతున్న ఎండలు, ఇంధన ధరల పెంపు ప్రభావం వంటింటిని తాకింది. జిల్లాలో జనాభాకు సరిపడా సాగు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో ఓ వైపు ఎండవేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు వంటింట్లో ధరలు హీటెక్కిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం పావుకిలో, అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. వంటింట్లో తప్పనిసరైన టమాట, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటివి కూడా సరిపడా కొనేందుకు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రూ.20 కంటే ఎక్కువే పెరిగాయి.
సాగు విస్తీర్ణం తక్కువ..
జిల్లాలో 4.48 లక్షల ఎకరాల్లో సాగుభూమి ఉండగా.. వానాకాలం, యాసంగి సీజన్లు కలుపుకొని 8,400 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వాణిజ్య పంటలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మూడు లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా తర్వాతి స్థానంలో కంది, వరి పంటలు ఉన్నాయి. కూరగాయలు సాగయ్యే 8,400 ఎకరాల్లో 50 శాతం సాగు కాగజ్‌నగర్ ప్రాంతంలోనే ఉంది. తర్వాత అత్యధికంగా రెబ్బెన, వాంకిడి మండలాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యాబే జీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు మాత్రమే సాగులో ఉన్నాయి. అదికూడా చాలా తక్కువ సాగు విస్తీర్ణంలో ఉండటంతో తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. స్థానికంగా కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో కరీంనగర్, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం..
రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందిస్తుంది. సాగుకు అయ్యే ఖర్చులను సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అయినా రైతులు మాత్రం వాణిజ్య పంటలకే ప్రాధాన్యతనిస్తున్నారు. కూరగాయల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సాగును ప్రోత్సహించాలని గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక హెక్టారు సాగయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని రూ.9600 రాయితీ అందిస్తామని ప్రకటించింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిద్దిపేటలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నుంచి కూరగాయల మొక్కలు కొంటే కొనుగోలు ఖర్చు, సాగుకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని అక్కడే సబ్సిడీ వర్తింపజేస్తారు. ఒకవేళ అక్కడి నుంచి కాకుండా ఇతర రిజిస్ట్రేషన్ కలిగిన నర్సరీ నుంచి మొక్కలు తీసుకుంటే బిల్ ఆధారంగా అధికారులు సబ్సిడీ నగదును నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు.
ఏటా ఇదే పరిస్థితి..
జిల్లాలో ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. కూరగాయల సాగు అంతంత మాత్రంగా ఉండటంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దిగుబడికి అనుకూలంగా ఉండే చలికాలంలో మినహాయించి ఏప్రిల్ నుంచి దిగుబడి తగ్గడం.. ధరలు పెరగడం సర్వసాధారణంగా మారింది. ఫిబ్రవరిలో టమా టా, మిర్చి, కొత్తిమీర ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. అలాగే తర్వాత వాతావరణం అనుకూలించక దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేస్తే ధరలు పెరుగుతున్నాయి. అన్ని కాలాల్లో సాగుచేసుకునే పద్దతులపై రైతులకు అవగాహన, శిక్షణ కల్పిస్తే పరిస్థితులు బాగుపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ముందుకు రావాలి..
కూగాయల సాగుకు రైతులు ముందుకు రావాలి. సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హెక్టారు సాగుపై రూ.9600 సబ్సిడీ అందిస్తుంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన మొక్కలు అందిస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ మల్చింగ్, బిందు సేద్యం అందిస్తాం. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలి.
– నదీమ్, జిల్లా ఉద్యాన అధికారి
జిల్లా కేంద్రంలో ధరలు
కూరగాయలు కేజీ(రూ.లలో)
టమాటా 50
క్యాలీఫ్లవర్ 80
పచ్చిమిర్చి 80
బెండకాయ 60
క్యాప్సికం 80
కాకర 70
మునగ 100
చిక్కుడు 100
వంకాయ 40
బీరకాయ 80
క్యారెట్ 80
కొత్తిమీర 150
దొండకాయ 70


