కుమురంభీం జన్మస్థలం రౌట సంకెపల్లికి రేపు గవర్నర్ రాక పలు అభివృద్ధి పనులకు శ్రీకారం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్: జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు కుమురంభీం, ఎడ్ల కొండు పురిటిగడ్డ ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్‌కు చెందిన రాయపూడి ఆశాలత కుమారుడు ప్రముఖ క్రికెటర్ నాగేంద్ర గతేడాది ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 29న కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం కోసం భీం పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఈ నెల 29న గ్రామానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు.
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు
రౌటసంకెపల్లిలో 25 ఇళ్లు ఉండగా 120 వరకు జనాభా ఉంది. అప్పటి గవర్నర్ చేతుల మీదుగా దత్తత కార్యక్రమానికి నాగేంద్ర శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామ క మిటీ ఏర్పాటు చేసి, ప్రతిరోజూ సాయంత్రం పలక, బలపంతో గంట పాటు అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ సంతకం చేస్తున్నారు. మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని ఈ నెల 29 న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిగా హాజరయ్యే గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. తారురోడ్డు పనులు చేపడుతున్నారు. సభకు షామియానాలు ఏర్పాటు చేశారు. ఆదివాసీ నాయకులు గుణవంత్‌రావు, సలహాదారు సిడాం అర్జు, కోఆర్డినేటర్ వెంకటేశ్, నిర్వహణ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు రౌట సంకెపల్లిలో గ్రామోత్సవం పోస్టర్లు ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
అభివృద్ధి కార్యక్రమాలివే..
కుమురంభీం, ఎడ్ల కొండు జన్మస్థలమైన రౌటసంకెపల్లిలో పోరాటయోధుల గుర్తింపు కోసం వారి 20 అడుగుల కాంస్య విగ్రహాలకు గవర్నర్ శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆదివాసీ గిరిజనులకు ఆరోగ్య కార్డులు, సంక్షేమ కార్డులు పంపిణీ చేస్తారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా సోలార్ ప్యానళ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామస్తులకు దుస్తుల పంపిణీ చేసి అనంతరం మద్యపాన నిషేధంపై గ్రామస్తులతో సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ కె.హరిత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
29న జిల్లాలో గవర్నర్ పర్యటన
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటిస్తున్నట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఉదయం 10.35 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని 11 గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామానికి చేరుకుని కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


