ఆసిఫాబాద్: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ అశోక్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 1న కెరమెరి మండలం కొఠారిలో ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో కలిసి భోజనం, ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. హెలిప్యాడ్ వద్ద ప్రముఖులకు స్వాగతం, గ్రామస్తులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. షామియానాలు, పైలాన్ ప్రారంభం, వాహనాల పార్కింగ్, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. రహదారిపై గుంతలను పూడ్చాలని సూచించారు. సాయంత్రం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో బహిరంగ సభ ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యబృందాలు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రముఖులు, అధికారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొఠారి నుంచి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వరకు సీఎం రోడ్డు మార్గాన వస్తున్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముందు ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లిలో తెలంగాణ గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులతో సమీక్షించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


