కెరమెరి: మండలంలోని కొత్తగూడ గ్రామంలో జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మంగళవారం గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు త్వరగా పూర్తిచేయాలని, అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న పాత నిర్మాణాలు, చెత్తాచెదారం తొలగించాలన్నారు. ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల ఎదుట పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉన్నందున ప్రత్యేక వేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, పీడీ ప్రకాశ్‌రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


