భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల రేట్లు సీజన్ ప్రారంభానికి ముందే రైతులపై ధరల పిడుగు బస్తాకు రూ.150 నుంచి రూ.400 వరకు భారం
రెబ్బెన: కష్టాలతో సాగుతున్న రైతులపై ఎరువుల భారం పడింది. కొన్నేళ్లుగా అన్నదాతలు దిగుబడి లేక చితికిపోతుండగా.. ఈసారి సీజన్‌కు ముందే కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు ఇప్పుడిప్పుడే సమాయత్తం అవుతున్నారు. ఈసారి పెట్టుబడి వ్యయం మరింత పెరగనుంది. ఒక్కో రకం రసాయన ఎరువుల బస్తాపై గరిష్టంగా రూ.400 వరకు పెరిగింది.
91,543 మెట్రిక్ టన్నుల వినియోగం
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 4.52 లక్షల ఎకరాల్లో సాగు చేసే పంటలకు సుమారు 91,543 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను వినియోగిస్తుంటారు. ఈసారి ధరల పెరుగుదలతో పెట్టుబడిలో సగం ఎరువులకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువుల ముడిసరుకు ధరలు, గల్ఫ్ దేశాల నుంచి నుంచి సహజ వాయువు సరఫరా లేకపోవడం, ఇరాన్– ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం, రవాణా చార్జీల పెరుగుదల వంటి అనేక కారణాలతో ఎరువుల ధరలు ఆకాశన్నంటాయి. ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు కంపెనీలు రేట్లు పెంచాయి. ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ వంటి ధరలే అధికంగా పెరగ్గా, డీఏపీ, యూరియా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం రైతులకు కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ వానాకాలం సీజన్‌లో 22,608 మెట్రిక్ టన్నుల డీఏపీ, 48,935 మెట్రిక్ టన్నుల మేర యూరియా వినియోగించునున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలకు మించి జిల్లా రైతులు వినియోగించే అవకాశం ఉంది.
15 రోజుల్లో సాగు పనులు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 4,52,175 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా రైతులు సాగు చేసే పంటల్లో పత్తి మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరి, కంది పంటలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో సారవంతమైన నేలలు అందుబాటులో లేకపోవడంతో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తిసాగు కోసం జిల్లాలోని రైతులు భూములను సిద్ధం చేస్తున్నారు. దుక్కిదున్ని తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల అంచనా ప్రకారం మరో 15 రోజుల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తుకోనున్నారు.
పెరిగిన ఎరువుల ధరలు (రూ.లలో)
ఎరువులు పాత ప్రస్తుత
28–28–0 1,350 1,350
డీఏపీ 1,350 1,350
పొటాష్ 1,800 1,975
20–20–0–13 1,400 1,800
14–35–14 2,150 2,350
10–26–26 1,200 1,700
12–32–16 2,025 2,250
సింగిల్ సూపర్ పాస్పెట్ 600 775
16–16–16 1,675 2,050
24–24–0 2,000 2,350
అకాశాన్నంటిన ‘కాంప్లెక్స్’
పంటల సాగులో డీఏపీ, యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను సైతం సమపాళ్లలో వాడాల్సి ఉంటుంది. భూమి లోపల మొక్కలకు కావాల్సిన పోషకాలు అందని సమయంలో రసాయన ఎరువుల రూపంలో అందిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. కానీ కాంప్లెక్స్, పొటాష్ ధరలు ఆకాశన్నంటాయి. కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో రైతులపై ఆర్థికభారం తప్పడం లేదు. రకాలను బట్టి బస్తాపై రూ.150 నుంచి రూ.400 పెరిగింది. అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా సమస్యల కారణంగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు.


