జూన్ 1 నుంచి కేంద్రాల పునఃప్రారంభం నియామకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు అవకాశం మెరుగుపడనున్న సేవలు
దహెగాం మండలం ఇట్యాల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం–1 అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కేంద్రంలోని ఆయా ఉద్యోగ విరమణ పొందడంతో రెండేళ్లుగా పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అంగన్‌వాడీ టీచరే పిల్లలను బడికి తీసుకువస్తూ.. వారికి వంట చేసి పెడుతున్నారు. ఆయా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంగన్‌వాడీ టీచర్ రమాదేవి తెలిపారు.
కౌటాల మండలం యాపల్‌గూడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి సైతం పక్కా భవనం లేక అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఐదేళ్లుగా అంగన్‌వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. మరో అంగన్‌వాడీ కార్యకర్త ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. దీంతో చిన్నారులకు ఆటపాటలు, చదువు అందడం లేదు. కేంద్రాన్ని తెరిచి పిల్లలకు భోజనం పెట్టి పంపిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీపై ఇటీవల ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించడంతో ఆయా కేంద్రాల పరిధిలోని లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
దహెగాం: అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏళ్లుగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయాల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటిస్తూ ఖాళీల వివరాలను వెల్ల డించింది. దీంతో కేంద్రాలకు మహర్దశ పట్టడంతో పాటు సేవలు మెరుగుపడనున్నాయి. జిల్లాలోని మ హిళా నిరుద్యోగుల్లోనూ ఖాళీల భర్తీపై ఆసక్తి నెలకొంది. జూన్ 1 నుంచి అంగన్‌వాడీ బడులు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ నెలాఖరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
1,006 కేంద్రాలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, వాంకిడి, జైనూర్, సిర్పూర్(టి) ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 283 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా, 347 కేంద్రాలకు పక్కా భవనాలు ఉన్నాయి. 353 కేంద్రాలు ఫ్రీరెంట్ పద్ధతిలో పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు సుమారుగా 37,353 మంది, గర్భిణులు 2,902 మంది, బాలింతలు 1,576 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 174, ఆయాలు పోస్టులు 445 ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు మరోచోట ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి నెట్టుకువస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లు, బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగనుంది. ఖాళీలు భర్తీ చేస్తేనే సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
నిబంధనల ప్రకారం..
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులు మొత్తం 619 ఖాళీలను గుర్తించాం. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. అయితే ఖాళీల భర్తీ ప్రక్రియపై ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు అందిన వెంటనే నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపరుస్తాం.
– స్వరూపారాణి, ఐసీడీఎస్ పీడీ
స్పష్టత వస్తేనే..
1,006 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 174 టీచర్, 445 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఆయా ఖాళీల వివరాలను ప్రతినెలా ప్ర భుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినా ఇంకా తమకు భర్తీ ప్రక్రియపై సరైన ఆదేశాలు రాలేదని వారు చెబుతున్నారు. జిల్లాలోని ఖాళీల ను మొదటి విడతలోనే భర్తీ చేస్తారా..? లేదా రెండో విడతలో భర్తీ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ముందుగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు.


