కాగజ్‌నగర్‌టౌన్: ప్రజలపై మరోసారి పెట్రో పిడు గు పడింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఒకే నెలలో నాలుగు సార్లు ఇంధన ధరల పెంచడంతో వాహనదారులు, రైతులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ప్రారంభ సమయం కావడంతో అన్నదాతలపై ఈ ప్రభా వం నేరుగా పడనుంది. మరో పది రోజుల్లో సాగు పనులు ప్రారంభం కానున్నాయి. పత్తి చేలల్లో దుక్కి దున్నేందుకు జిల్లావ్యాప్తంగా ట్రాక్టర్ల విని యోగం అధికంగా ఉంది. ఈ సమయంలో పెట్రో ధరల పెంపు వారికి భారం కానుంది.
జిల్లాలో పెంపు ఇలా..
ఈ నెల 15, 19, 23, 25 తేదీల్లో ఇంధన ధరలను పెంచారు. పెట్రోల్ లీటర్‌పై రూ.3.39, రూ.0.99, రూ.0.97, రూ.2.84 చొప్పున పెరిగింది. ఈ నెల 15కు ముందు జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.108.86 ఉండగా, ప్రస్తుతం రూ.117.05కు చేరింది. డీజిల్ ధరలు రూ.3.28, రూ.0.99, రూ.0.99, రూ.2.86 పెంచుకుంటూ రాగా, ఈ నెల 15కు ముందుకు రూ.100.70 ఉన్న డీజిల్ లీటర్ ధర ప్రస్తుతం రూ.108.82కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 85 డాలర్లు దాటడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. డీజిల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలపైనా ప్రభావం పడుతోంది. లారీ అద్దెలు 15 శాతం పెరగడంతో హోల్‌సెల్ మార్కెట్ నుంచి చిల్లర దుకాణాలకు వచ్చేసరికి అన్ని వస్తువుల రేట్లు అధికమవుతున్నాయి.


