ఆసిఫాబాద్‌అర్బన్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పెట్రో ధరలు పెంచి సామాన్యుడిపై అదనపు భారం మోపడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ సాధారణ ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.


