చింతలమానెపల్లి: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడికి పాల్పడిన ఘటనలో నలు గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కాగజ్‌నగర్ అటవీ డివిజన్ అధికారి అప్పయ్య తెలిపారు. సాధ్యమైనంత వరకు ఎవరూ అడవుల్లోకి వెళ్లొద్దని, అడవులు మన భవిష్యత్ అని, వాటిని మనమే కాపాడుకోవాలని సూచించారు. పులి గ్రామాల సమీపంలోకి వచ్చినా.. సమస్యాత్మక పరిస్థితులున్నా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే.. చంద్రపూర్ ఘటన నేపథ్యంలో అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు, ఆయా వర్గాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు.
సాక్షి: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి ఘటన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
అప్పయ్య: అటవీ సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. సమస్యాత్మ క ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలు వెళ్లకుండా నిఘా ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో తునికాకు సేకరణ నిలిపేశాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
సాక్షి: మహారాష్ట్ర అటవీశాఖ అధికారులతో మీకు సమన్వయం ఎలా ఉంది?
అప్పయ్య: చంద్రపూర్ ఘటన అనంతరం పు లుల సంచారంపై మహారాష్ట్ర అటవీ అధి కారులతో మాట్లాడాం. వారి ద్వారా జిల్లాలోకి వలస వచ్చే పులుల సమాచారం నిత్యం తెలుసుకుంటున్నాం.
సాక్షి: పులి దాడి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు?
అప్పయ్య: అటవీ సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సమీప ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అటవీశాఖ సూచనలు పాటించాలి. తునికాకు సేకరించే వారు, రైతులు గుంపులుగుంపులుగా వెళ్లాలి. ఇందులో ఒకరు పరిసరాలను గమనించాలి. అటవీ మార్గాల గుండా ప్రయాణించేవారు అడవుల్లో వాహనాలను నిలుపడం, అక్కడే భోజనాలు చేయడం లాంటివి చేయవద్దని సూచిస్తున్నాం. వివిధ పనులపై అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లేవారు సాయంత్రం 4గంటల్లోపే ఇంటికి చేరుకోవాలి.
సాక్షి: అటవీ ప్రాంతాల్లో చాలామంది ఫొటో షూట్‌కు వస్తుంటారు కదా?
అప్పయ్య: జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతా ల్లో పులుల సంచారం ఉంది. ఫొటో షూట్ ల కోసం అక్కడికి వెళ్లడం ఆపదను కొని తెచ్చుకోవడమే. అటవీశాఖ అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లొద్దు. అనుమతి లే కుండా అడవుల్లో ఫొటోషూట్ నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.


