కెరమెరి: మార్చి రెండోవారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడే సూర్యప్రతాపం మొదలైంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదు. విద్యుత్ సౌకర్యమున్న పాఠశాలల తరగతి గదుల్లో ఫ్యాన్లు లేవు. దీంతో ఉక్కపోతతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండుతున్న ఎండల దృష్ట్యా ఈ నెల 16నుంచి ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, పాఠశాల సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ఉదయం 8నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించి అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. పదోతరగతి పరీక్షా కేంద్రాలు కేటాయించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో 1,273 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలుండగా 92వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
పర్యవేక్షణ తప్పనిసరి
ఒంటిపూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి గా ఉండాలి. ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా బయట తిరిగితే అ తినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై పడే ప్ర మాదముంది. సరదాగా ఆటపాటల కోసం బయటి కి వెళ్లే పిల్లలు ప్రమాదాలు కొనితెచ్చుకునే ఆస్కారముంటుంది. ఇంటి పరిసరాల్లో చెరువులు, కుంట లు, వ్యవసాయ బావులు, నీటి గుంతలుంటే మరి న్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఈత కోసం వెళ్లి నీటమునిగే ప్రమాదమున్నందున వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లనీయరాదు. ఎండ తగ్గాక సా యంత్రం బహిరంగ స్థలాల్లో ఆడుకునేలా చూడాలి.
సమయపాలన పాటించాలి
ఈ నెల 16నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. ప్రతి ఒక్కరూ ప్రేయర్‌కు హాజరుకావాలి. విద్యార్థులు ఎండలకు అస్వస్థతకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా చర్యలు చేపట్టాలి.
– లలిత, జిల్లా విద్యాధికారి
బడి వేళలు ఇలా..
మొదటిగంట 7.45
రెండో గంట 7.50
ప్రార్థన 7.50 నుంచి 8వరకు
మొదటి పీరియడ్ 8నుంచి 8.40..
రెండో పీరియడ్ 8.40 నుంచి 9.20..
మూడో పీరియడ్ 9.35 నుంచి 10..
స్వల్ప విరామం 10నుంచి 10.20..
నాలుగో పీరియడ్ 10.20 నుంచి 11..
ఐదో పీరియడ్ 11నుంచి 11.40..
ఆరో పీరియడ్ 11.40 నుంచి 12.30..


