తిర్యాణి మండల అభివృద్ధికి కృషి చేయాలి
తిర్యాణి: వెనుకబడిన తిర్యాణి మండల సమగ్రాభివృద్ధికి అధికారులు సమష్టి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్వహణ, అంగవాడీ కేంద్రాలకు అందించే పౌష్టికాహారం, పశువుల టీకాలు తదితర అంశాలను సంపూర్ణత అభియాన్ 2.0లో చేపట్టాలన్నారు. గతంలో దేశంలోనే మండలానికి మంచి స్థానం లభించిందని, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, డీఏవో వెంకట్, తహసీల్దార్ శ్రీనివాస్, సీడీపీవో తిరుపతమ్మ, ఏవో వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


