దూరం.. అగ్నికి ఆజ్యం! | - | Sakshi
Sakshi News home page

దూరం.. అగ్నికి ఆజ్యం!

Feb 23 2026 7:03 AM | Updated on Feb 23 2026 7:03 AM

దూరం.

దూరం.. అగ్నికి ఆజ్యం!

సిర్పూర్‌ నియోజకవర్గంలో ఒకే ఫైర్‌స్టేషన్‌ సుమారు వంద కిలోమీటర్ల పరిధిలో సేవలు సకాలంలో ఫైరింజన్‌ చేరక పెరుగుతున్న ప్రమాద తీవ్రత వేసవి ప్రారంభంతో పొంచి ఉన్న అగ్ని ప్రమాదాల ముప్పు

చింతలమానెపల్లి: అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి అవసరాలను విస్మరిస్తోంది. మారుమూల మండలాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే సర్వం బూడిదవుతోంది. సిర్పూర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, వందలాది గ్రామాలకు కలిపి కేవలం ఒకే ఒక అగ్నిమాపక కేంద్రం ఉండటంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్‌ ఇంజిన్‌ వచ్చేలోపే బాధితులు కట్టుబట్టలతో మిగిలే పరిస్థితి దాపురించింది. వేసవి ప్రారంభం కావడంతో చింతలమానెపల్లి, బెజ్జూర్‌, కౌటాల, పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల్లోని ప్రజలు అగ్ని ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలో చింతలమానెపల్లి మండలం ఖర్జవెల్లి గ్రామంలోని చౌదరి భాస్కర్‌ అనే రైతు ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా పత్తి కాలిపోయింది. సుమారుగా రూ.60 వేల నష్టం సంభవించింది. గతేడాది బెజ్జూర్‌ మండలంలోని ఓ గ్రామం నుంచి కౌటాల మీదుగా వెళ్తున్న పత్తిలోడ్‌ వ్యాన్‌ ముత్తంపేట – కౌటాల మధ్య అగ్ని ప్రమాదానికి గురైంది. రహదారిపై జరిగిన ఈ ప్రమాదం భయాందోళన కలిగించింది.

ఒకే ఫైర్‌ స్టేషన్‌

సిర్పూర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కలిపి ఒకే ఫైర్‌స్టేషన్‌ ఉంది. దాదాపుగా 100 కిలో మీటర్ల పరిధిలో సుమారుగా 130 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 300 గ్రామాలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలకు కలిపి ఒకే అగ్నిమాపక కేంద్రం ద్వారా సేవలందిస్తున్నారు. ప్రజలకు అన్ని అవసరాలు తీరుస్తున్నామంటున్నా.. అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడేందుకు తగిన ఏర్పాటు చేయకపోవడంతో ప్రజ లు ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని రైతుల ఇళ్లన్నీ అధికంగా కర్ర, వెదురు, గడ్డి ఆధారంగా నిర్మితమయ్యాయి. పశువుల కోసం నిల్వ ఉంచే దాణా, గడ్డి అగ్ని ప్రమాదాలకు కారకా లుగా ఉంటున్నాయి. రైతు కుటుంబాలు గోదాములు లేకపోవడంతో ఇళ్లలోనే పంటను నిల్వ ఉంచుతున్నారు. ఆయా మండలాల్లో సుమారుగా ఏటా పదుల సంఖ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ నుంచి జూన్‌ నెలల్లో అధికంగా అగ్ని ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. 15కు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. పొలాలలో వరికో తల అనంతరం ఉంచిన వరికుప్పలు దగ్ధమైన సందర్భాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

దూరంతోనే జాప్యం

కౌటాల మండల కేంద్రం కాగజ్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ నుండి 40 కిలో మీటర్ల దూరంలో ఉండగా, చింతలమానెపల్లి మండల కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెజ్జూర్‌ మండలంలోని కొన్ని గ్రామాలకు కాగజ్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరం చేరుకోవాలంటే సుమారుగా 3 గంటల సమయం పడుతుంది. ఫైరింజన్‌ వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరుగుతోంది. నియోజకవర్గంలో కౌటాల, బెజ్జూర్‌, చింతలమానెపెల్లి మండలాల పరిధిలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే బెజ్జూర్‌, సిర్పూర్‌ మండలాలలోని సుమారు 100 గ్రామాలకు ఉపయోగపడుతుంది. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సకాలంలో ఫైరింజన్‌ చేరుకోగలిగితే ప్రమాదం తీవ్రతతో పాటు ఆస్థినష్టం తగ్గుతుందని, ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నిత్యం ప్రమాదాలు

మా ఊరిలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అందరం కలిసి మంటలు ఆర్పుతాం. కానీ పెద్ద ప్రమాదాల సమయంలో మంటలకు ఆస్తులు కాలిపోవాల్సిందే.

– శ్రీనివాస్‌, రుద్రాపూర్‌

ఫైర్‌స్టేషన్‌ మంజూరు చేయాలి

అగ్ని ప్రమాదాల జరిగినప్పుడు కాగజ్‌నగర్‌ నుంచి ఫైరింజన్‌ రావాలంటే చాలా సమయం పడుతోంది. ఆస్తులు నష్టపోయి చాలామంది అప్పుల పాలయ్యారు. స్థానిక మండలాల్లో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల మండలాలకు అందుబాటులో ఉంటుంది.

– బుర్రి రూపేష్‌, గూడెం

దూరం.. అగ్నికి ఆజ్యం!1
1/3

దూరం.. అగ్నికి ఆజ్యం!

దూరం.. అగ్నికి ఆజ్యం!2
2/3

దూరం.. అగ్నికి ఆజ్యం!

దూరం.. అగ్నికి ఆజ్యం!3
3/3

దూరం.. అగ్నికి ఆజ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement