ఆసిఫాబాద్‌కు దశాబ్దాల చరిత్ర | - | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌కు దశాబ్దాల చరిత్ర

Jan 30 2026 6:50 AM | Updated on Jan 30 2026 6:50 AM

ఆసిఫాబాద్‌కు దశాబ్దాల చరిత్ర

ఆసిఫాబాద్‌కు దశాబ్దాల చరిత్ర

నిజాం కాలంలోనే ఉమ్మడి జిల్లాకు జిల్లా కేంద్రంగా సేవలు రాష్ట్రంలో తొలి ఆర్టీసీ డిపో ఇక్కడే.. ఆ తర్వాత పంచాయతీ స్థాయికి మార్పు మళ్లీ 2014లో మున్సిపాలిటీగా ఏర్పాటు తొలి మున్సిపల్‌ ఎన్నికల్లో ఎవరిదో విజయం..?

ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అనేక ఉద్యమాలకు ఇది కేంద్రంగా నిలిచింది. జనగామ పేరుతో ఉన్న ఈ ప్రాంతానికి 1907 నిజాం కాలంలో ఆసఫ్‌ జాహి వంశం పేరు మీదుగా ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే మార్గంలో ఉన్న రెబ్బెనలోని రైల్వే స్టేషన్‌కు ఆసిఫాబాద్‌ రోడ్‌గా పేరు పెట్టారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు తరలిపోయింది. అయినా 1961 వరకు మున్సిపాలిటీగానే ఉంది. అనంతరం మేజర్‌ గ్రామ పంచాయతీగా స్థాయి మార్చారు.

ఆర్టీసీ డిపో, జైలు ఏర్పాటు

ఆసఫ్‌ జాహీ వంశం పేరున ఏర్పడిన ఆసిఫాబాద్‌కు నిజాం సర్కార్‌ అధిక ప్రాధాన్యత నిచ్చింది. ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ సంస్థానంలో ఏర్పాటు చేసిన తొలి మూడు బస్‌డిపోల్లో మొదటిది ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు ఇక్కడి డిపోకు ఇంగ్లాడ్‌ నుంచి తెప్పించిన ఏడు అల్బీనీయన్‌ బస్సులు కేటాయించారు. నిజాం హయాంలోనే అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని జన్కాపూర్‌లో ఐదెకరాల్లో సుమారు 200 మంది ఖైదీలను ఉంచేలా జిల్లా జైలు నిర్మించారు. కొద్దికాలం పాటు జైలు నిర్వహణ లేదు. మరమ్మతుల అనంతరం 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ఎంజీ గోపాల్‌ తిరిగి ప్రారంభించారు. అనంతరం 2008లో ఆదిలాబాద్‌కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్‌ సబ్‌ జైలుగా మార్చారు.

సాయుధపోరాటంలో పట్టణవాసులు

నిజాం నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జరిగిన సాయుధ పోరాటంలో ఆసిఫాబాద్‌ పట్టణవాసులు కీలక పాత్ర పోషించారు. ఇక్కడి యువత కాంగ్రెస్‌ అతివాద నాయకుల నేతృత్వంలో 1947 సెప్టెంబర్‌ నుంచి ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నారు. పట్టణానికి చెందిన బోనగిరి వెంకటేశం, చీల శంకర్‌, చీల విఠల్‌, ఖాడ్రే శంకర్‌, రాంసింగ్‌, రేవయ్య, తాటిపెల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్‌ విఠల్‌, జగన్నాథ్‌ మహారాష్ట్రలోని చాందాలో సాయుధ శిక్షణ పొందారు. రాంచందర్‌ రావు పైకాజీ, సుబ్బబా బురావు, దండనాయకుల గోపాల్‌ కిషన్‌రావు, వామన్‌రావు వైరాగరే, ప్రభాకర్‌రావు మసాదే ఉద్యమాలకు సహకారం అందించారు. నాటి పోరాటయోధులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది.

తొలి సర్పంచ్‌ పైకాజీ

నిజాం కాలంలో ఆసిఫాబాద్‌కు తొలి సర్పంచ్‌గా రాంచందర్‌రావు పైకాజీ సేవలందించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది సంగర్స్‌ బాల్‌కిషన్‌రావు కొన్నేళ్లు పనిచేశారు. పైకాజీ వారసుడు దండనాయకుల రమేశ్‌బాబు 1970 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. 1980 నుంచి 2000 వరకు తుజాల్‌పూర్‌ లక్ష్మి నారాయణగౌడ్‌ పనిచేయగా, అనంతరం ఎస్టీ రిజర్వ్‌ కావడంతో 2002, 2015లో మర్సోకోల సరస్వతి గెలుపొందారు. 2006, 2015లో కోవ లక్ష్మి(ప్రస్తుత ఎమ్మెల్యే) రెండుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిలిచిపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది.

2024లో మున్సిపాలిటీగా ఏర్పాటు

2016లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంగా మారింది. పంచాయతీ కావడంతో సాంకేతికంగా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చాలని 2018లో శాసన సభ తీర్మానించింది. 2019లో ఆగస్టు 2న ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. అయితే ఆసిఫాబాద్‌, భద్రాచలం, సారపాక బల్దియా ప్రతిపాదనల్లో ఏజెన్సీ అంశం అడ్డంకిగా మారింది. అనంతరం పట్టణం నుంచి రాజంపేటను ప్రత్యేక పంచాయతీగా విడదీసి ప్రతిపాదనలు పంపడంతో 2024 ఫిబ్రవరిలో అప్పటి గవర్నర్‌ తమిళసై ఆమోదించారు. జిల్లా కేంద్రం 3,831 ఎకరాల విస్తీర్ణం(17.02 చదరపు కిలోమీటర్లు), 16,597 మంది జనాభా కలిగిన 20 వార్డులతో మున్సిపాలిటీగా అవతరించింది. ఆసిఫాబాద్‌ పట్టణం, గొడవెల్లి, జన్కాపూర్‌ ప్రాంతాలు కలిపి బల్దియాగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిసారి ఫిబ్రవరి 11న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement