
భారీ వర్షానికి అతలాకుతలం
రెబ్బెన: మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి గంగాపూర్, పులికుంట, నవేగాం వాగులతో పాటు పెద్దవాగు ఉప్పొంగింది. నంబాల బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహించడంతో నంబాల, నారాయణపూర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. గంగాపూర్ వాగు కు భారీగా వరద పొటెత్తి బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ మెట్లను తాకుతూ ప్రవహించింది. గోలేటిలోని మానెపల్లికుంట అలుగు ప్రవహించడంతో ఆ వరద ప్రవాహానికి రేకులగూడకు చెందిన టేకం సరోజ ఇల్లు కూలిపోయింది. అటవీ ప్రాంతం నుంచి వరద రావడంతో ఎన్టీఆర్ నగర్‌లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మద్దెల శ్రీనివాస్, మేకల నగేశ్, బోగే శారద, బెజ్జం సావిత్రి, మల్లేశ్, రాజుల శ్రీకాంత్, మోడెం శంకర్, మోడెం రాజాగౌడ్, పూదరి నగేశ్, నికోడే నాందేవ్, రవీందర్, కొర్ర తిరుపతి, భీంరావు, కొమురవెళ్లి స్వామి, రామగోని రవి, ప్రసాద్‌గౌడ్ ఇళ్లలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు తడిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాలనీని పరిశీలించి ప్రజలను పరామర్శించారు. కాలనీలోకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై చంద్రశేఖర్ కాలనీని సందర్శించారు. వరద నీటికి అడ్డంగా ఉన్న చెత్తాచెదారాన్ని జేసీబీతో తొలగించారు.

భారీ వర్షానికి అతలాకుతలం