
‘సిర్పూర్’ను నంబర్ 1గా తీర్చిదిద్దుతా
● బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్‌నగర్‌టౌన్: అభివృద్ధికి నోచుకోని సిర్పూర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతానని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తర్వాత మొ దటిసారి కాగజ్‌నగర్ పట్టణానికి బుధవారం సాయంత్రం వచ్చారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పలు వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పదవి కట్టబెట్టారని తెలిపారు. ఈ గుర్తింపు నాకు మాత్రమే కాదని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు మోసానికి గురయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు లెండుగురే శ్యామ్‌రావు, ముస్తాఫీస్, మినహాజ్, నవీన్, రాజు, అర్షద్ పాల్గొన్నారు.