● ప్రచారంలో శబ్ద పరిమితులపై నిబంధనలు ● ఉల్లంఘిస్తే నియమావళి ప్రకారం చర్యలు
నిర్మల్‌ఖిల్లా: ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల మైకులు డీజే సౌండ్ బాక్స్‌లతో కూడిన ప్రచార వాహనాలు గల్లీగల్లీలో, గ్రామీణ ప్రాంతాల్లో సందడి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రచార సాధనాల మోత చెవుల్లో మారుమోగుతోంది. జానపద టచ్‌తో కూడిన ప్రత్యేక గీతాలు హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థుల గుణగణాలతో పాటు, పార్టీలకు సంబంధించిన పాటలు నిరంతరం హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ ప్రచార సాధనాల మోత సాధారణ ప్రజానీకానికి, విద్యాసంస్థలు, ప్రార్థన మందిరాల వద్ద ఇబ్బందులు కలిగించే అవకాశాలున్నాయి. అదేవిధంగా వైద్యశాలలు, న్యాయస్థానాల సమీపంలో, వ్యాపార సముదాయాలు, పారిశ్రామిక ప్రాంతాల వద్ద విపరీతమైన ధ్వనులతో పాటలను పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ శబ్ద తీవ్రతపై కొన్ని నిబంధనలను నిర్ణయించింది. ఈసారి మితిమిరిన శబ్దంతో మైకులతో ఊదరగొడితే చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులు, వారి తరఫున ప్రచారం చేసేవారు ఈ అంశాలపై జాగ్రత్త వహించాలి. ఏ ప్రాంతంలో ఎంత శబ్దంతో కూడిన ధ్వనులను వినియోగించాలో, ఎన్ని డెసిబుల్స్ మించకుండా ఉండాలో నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారం డీజే ప్రచార సాధనాల ధ్వనిశబ్దం మితిమిరితే జరిమానాలతో పాటు జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉందని అధికారులు అంటున్నారు.