ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

ఈనెల 19న కుటుంబ బీమా పథకం ప్రారంభం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మధిర: అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందే వరకు పథకం కొనసాగిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, ముదిగొండ మండలాల్లో ఆదివారం ఆయన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’లో సంబురాల్లో పాల్గొన్నారు. మధిర మండలం దెందుకూరులో ముప్పసాని కృష్ణవేణి – రాంబాబు, మల్లారంలో యండ్రాతి అచ్చారావు ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌తో ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబీకులతో కలిసి దీపావళి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పుట్టడం ఒక వరమని భావించేలా దశల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరు చేసిన 8లక్షల ఇళ్లలో 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. నిర్మాణ దశల ఆధారంగా ప్రతీ సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. అలాగే, పేదలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌ కిలో రూ.90 వరకు ఉన్న సన్న బియ్యాన్ని రేషన్‌ షాప్‌ల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, అంతర్జాతీయ ప్రమాణాలతో 105 యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తుండడమే కాక 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మూడు మండలాల్లో...

ఎర్రుపాలెం/బోనకల్‌/ముదిగొండ: ఇటీవల నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు జరుపుకున్న దీపావళి వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, బంజరల్లో మోదుగ సీతారాజ్యం, రెడ్డిబోయిన నాగమణి ఇళ్లలో వేడుకలకు కలెక్టర్‌ దివాకరతో కలిసి హాజరయ్యారు. అలాగే, బోనకల్‌ మండలం రాయన్నపేటలో పర్సగాని గోపి ఇంట్లోనే కాక గోవిందాపురం(ఏ) గ్రామంలో సంబురాలకు హాజరైన ఆయన, గోవిందాపురం(ఏ) గ్రామంలో మహిళలకు దాతలు సమకూర్చిన చీరలు పంపిణీ చేశారు. ఇక ముదిగొండ మండలం వల్లాపురం, వనంవారికిష్టాపురం, ముదిగొండలో ఇందిరమ్మ గృహాల్లో దీపావళి సంబురాల్లో డిప్యూటీ సీఎం భట్టి భట్టి పాల్గొన్నారు. అలాగే, ముదిగొండలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను పరిశీలించాక, ముదిగొండ, వల్లభి రహదారిలో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు లక్కిరెడ్డి చెన్నమ్మ, వేమిరెడ్డి అన్నపూర్ణ, పార్టీ మండలాల అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, కర్నాటి రామకోటేశ్వరావు, గుడిపూడి బుచ్చిరావమ్మ, నాయకులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పైడిపల్లి కిశోర్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, చేబ్రోలు వెంకటేశ్వర్లు, సుబ్బారావు, మందరపు నాగేశ్వరరావు, ఇసుకల రమేష్‌, కోడే నాగేశ్వరరావు, తాటికొండ రమేష్‌, ఉపేందర్‌రావు, ఆల్లకుంట భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement