గనిలో ఉద్యోగుల విజయోత్సవ సంబురాలు
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీ–2 బొగ్గు గనికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకమైన ఫైవ్ స్టార్ రేటింగ్ ప్రకటించింది. ఈ సందర్భంగా సత్తుపల్లి ఏరియాలో సోమవారం విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి ఆధ్వర్యాన జరిగిన వేడుకల్లో ఓసీ ఉద్యోగులు, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపు రావడానికి కృషి చేసిన ఉద్యోగులు, కార్మికులను అభినందించిన జీఎం.. అందరి సమన్వయంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
ప్రజా దివస్‌లో
ఫిర్యాదుల స్వీకరణ
ఖమ్మంక్రైం: ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే(ప్రజా దివస్) సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సునీల్‌దత్ పలువురి నుంచి ఫిర్యాదులను స్వీకరించి వివరాలు ఆరా తీశారు. భూవివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రతీ ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, చట్టపరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. తద్వారా ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మం పెంచాలని సీపీ సూచించారు.
నయనానందంగా
గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: దీపావళి పర్వదినం వేళ భక్తజన సందోహం నడుమ ఖమ్మంలో లక్ష్మీనరసింహుడి గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా ఆదివారం సాయంత్రం ఓ పక్క దీపావళి కనుల పండుగగా జరుగుతుండగా, స్వామి వారి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. తొలుత పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో గుట్ట పైనుంచి కిందకు తీసుకొచ్చి నగర పుర వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత తిరిగి పల్లకీని గుట్టపై ఆలయానికి చేర్చాక, రాతి కొండపై అర్చకులు నక్షత్ర జ్యోతి వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు, అర్చకులతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


