మార్కెట్లకు పాలకవర్గాలు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు పాలకవర్గాలు

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

● సత్తుపల్లి, కల్లూరు చైర్మన్‌ పదవులు సీనియర్లకే.. ● సత్తుపల్లి చైర్మన్‌ నరసింహారావుకు నియామకపత్రం అందజేసిన ఎమ్మెల్యే రాగమయి

● సత్తుపల్లి, కల్లూరు చైర్మన్‌ పదవులు సీనియర్లకే.. ● సత్తుపల్లి చైర్మన్‌ నరసింహారావుకు నియామకపత్రం అందజేసిన ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, కల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు నూతన పాలకవర్గాలను ప్రకటించారు. అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌ పలు సందర్భాల్లో ప్రకటించగా, అందుకు తగినట్టే నియామకాలు చేపట్టారు. సత్తుపల్లి మార్కెట్‌ జనరల్‌కు, కల్లూరు మార్కెట్‌ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. ఈమేరకు సత్తుపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చల్లగుళ్ల నరసింహారావు, కల్లూరు చైర్మన్‌గా మాదిగ సామాజిక వర్గానికి చెందిన గర్నెపూడి నారాయణ ఎంపిక చేశారు. అలాగే, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పదవుల్లోనూ సామాజిక వర్గాల సమతుల్యత పాటించారు. గత పాలకవర్గంలో సత్తుపల్లి చైర్మన్‌ పదవికి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన దోమా ఆనంద్‌బాబుకు, కల్లూరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన భాగం నీరజాదేవికి దక్కింది. ఈసారి రిజర్వేషన్లు తారుమారు కావడంతో మార్పులు చోటు చేసుకున్నాయి.

పలుమార్లు చేజారినా..

సత్తుపల్లి మార్కెట్‌ చైర్మన్‌గా నియమితులైన చల్లగుళ్ల నరసింహారావుకు పలుమార్లు ప్రొటోకాల్‌ పదవులు వచ్చినట్టే వచ్చి చేజారాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా 32 ఏళ్ల క్రితం ఆయన సత్తుపల్లి సొసైటీ చైర్మన్‌గా రాజకీయ అరంగ్రేటం చేశారు. సొసైటీ చైర్మన్‌గా 1995 రెండోసారి ఎన్నికవుతారని భావిస్తే, అప్పటి టీడీపీలో లక్ష్మీపార్వతి వర్గం, కాంగ్రెస్‌ పార్టీ కలసి పనిచేయడంతో పదవి దక్కలేదు. 2001 సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా ప్రచారం జరిగినా సామాజిక సమీకరణలతో టికెట్‌ రాలేదు. ఆతర్వాత తుమ్మలతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన సత్తుపల్లి మార్కెట్‌ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అనంతరం కాంగ్రెస్‌లో చేరాక, సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రచారం జరిగితే మహిళకు రిజర్వ్‌ కావడంతో ఆయన సతీమణి నిర్మలాదేవి అవకాశం ఇస్తామన్నా అలా జరగలేదు. ఇప్పుడు మార్కెట్‌ చైర్మన్‌ పదవి జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో 32ఏళ్ల తర్వాత నరసింహారావుకు ప్రొటోకాల్‌ పదవి లభించింది. ఆయన 15ఏళ్ల పాటు టీడీపీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఈనెల 16న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షాన మార్కెట్‌ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారానికి నిర్ణయించారు.

కల్లూరు కమిటీ ఇలా...

కల్లూరు వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌గా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన గర్నెపూడి నారాయణను ఎంపిక చేశారు. వైస్‌ చైర్మన్‌ పదవి కల్లూరు మండలానికి కేటాయించారు. అయితే, డైరెక్టర్‌ పదవుల ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోవడంతో పూర్తిస్థాయి కమిటీని అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement