నేడు సద్దుల సంబురం
జిల్లాకు 2.60 లక్షల చీరలు..
ఇంకా 90 వేలు అవసరం
పంపిణీపై స్పష్టత లేక
భద్రపరిచిన అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగ వేళ చీరలు ఇచ్చి వేడుక ఘనంగా జరుకునేలా ప్రోత్సహిస్తోంది. ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది పండుగ సమయాన చీరలను ఇవ్వాలని నిర్ణయించినా.. వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. ఈ ఏడాది సద్దుల బతుకమ్మ పండుగ నాటికి మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సరిపడా సంఖ్యలో చేరకపోవడం గమనార్హం. గతనెల 4న రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ్య(సీతక్క) సత్తుపల్లిలో పర్యటించిన సందర్భంగా ఇందిరా మహిళాశక్తి సదస్సులో మహిళలకు చీరలను లాంఛనంగా పంపిణీ చేశారు. మిగతా చోట్ల ఎక్కడా అధికారికంగా చీరల పంపిణీని ప్రారంభించకపోవడంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయినట్లయింది. ప్రభుత్వం నుంచి చీరల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో అధికారులు మండలాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో భద్రపరిచారు.
సరిపడా చేరని చీరలు
ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు అందించేందుకు జిల్లాలకు చీరలు సరఫరా చేసింది. జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధి సంఘాల సభ్యులు 3.50 లక్షల మందికి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయిస్తే.. ఇప్పటివరకు 2.60 లక్షలే చేరాయి. సెర్ప్కు సంబంధించి 1,46,711 చీరలు రాగా.. మెప్మాకు సంబంధించి కేఎంసీకి 1.14 లక్షల చీరలు రావడంతో నిల్వ చేశారు.
కానుకలు లేనట్టే..
గతేడాది సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినట్లుగానే ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి మహిళా సభ్యులకు కానుకలు అందుతాయని అంతా భావించారు. ఆగస్టు నెలాఖరుకే 1.46 లక్షల చీరలు జిల్లాకు చేరగా, మరో 1.14 లక్షల చీరలు సెప్టెంబర్లో కేఎంసీకి చేరాయి. మిగిలిన చీరలు ఇప్పటి వరకు రాకపోవడం, ఆదివారం సద్దుల బతుకమ్మ జరగనుండడంతో ఈ ఏడాది ప్రభుత్వం తరఫున చీరలు లేకుండానే పండుగ పూర్తవుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది పాలపిట్ట రంగు కాకుండా.. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఎరుపు రంగు అంచుతో మెరిసిపోయే చిలుకపచ్చ రంగు చీరలను సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం విదితమే.
కొన్ని మండలాలు, కేఎంసీకి మాత్రమే...
మహిళలకు పంపిణీ చేయాల్సిన చీరలు జిల్లాలోని 9 మండలాలతో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు మాత్రమే చేరాయి. ఇంకా 11 మండలాలు, ఐదు మున్సిపాలిటీలకు రావాల్సి ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాలతో పాటు సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలకు ఒక్క చీర కూడా చేరలేదు. వైరా నియోజకవర్గంలో కారేపల్లి మండలానికి 13,976 చీరలు చేరగా.. ఏన్కూరు, కొణిజర్ల, వైరా, వైరా మున్సిపాలిటీకి పంపిణీ చేయలేదు. మధిర మండలం చింతకానికి 16,020, ముదిగొండకు 19,163 చీరలు చేరగా.. బోనకల్, మధిర, ఎర్రుపాలెం, మధిర మున్సిపాలిటీలకు చీరల సరఫరా జరగలేదు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కలిపి 61,523 చీరలు చేరాయి. మరోపక్క ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంకు 21,063 చీరలు, మెప్మా పరిధిలో కేఎంసీకి 1.14 లక్షలు చీరలు చేరాయి. ఇక ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కామేపల్లి మండలానికి ఇప్పటికే 14,966 చీరలు చేరాయి.
పెవిలియన్ మైదానంలో
డీఆర్డీఏ ఆధ్వర్యాన ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ ఆదివారం జరుపుకునేందుకు జిల్లా మహిళలు సిద్ధమయ్యారు. ఈమేరకు ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో సద్దుల బతుకమ్మ పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు డీఆర్డీఓ కె.శ్రీరామ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెవిలియన్ మైదానంలో 12 అడుగుల భారీ బతుకమ్మను రకరకాల పూలతో అలంకరిస్తారు. ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, ముదిగొండ, బోనకల్, చింతకాని, కుసుమంచి, తిరుమలాయపాలెం తదితర మండలాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలను సమీకరిస్తున్నారు. అలాగే, కోలాట బృందాల ఆటపాటలు, బతుకమ్మ పాటలు, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
అధికారులకు విధులు
సద్దుల బతుకమ్మ సంబరాలు విజయవంతం అయ్యేలా డీఆర్డీఏలోని వివిధ విభాగాల ఉద్యోగులకు బాధ్యతలు కేటాయించారు. మైదానం పరిశుభ్రత, ఆహ్వాన పత్రికల పంపిణీ, వీడియో చిత్రీకరణ, నిమజ్జనానికి వాహనాల ఏర్పాటు పనుల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజలు పాల్గొని సంబరాలను జయప్రదం చేయాలని డీఆర్డీఓ కోరారు.
అక్కాచెల్లెళ్లకు అందని
‘రేవంతన్న కానుక’


