● తల్లి మృతితో కుమారుడి బలవన్మరణం
ఖమ్మంక్రైం: తల్లి మృతి చెందిందనే మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందిన పెంట సాయి(23) తల్లి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటినుంచి సాయి నిత్యం బాధపడుతుండేవాడు. ఈక్రమాన శుక్రవారం రాత్రి కుటుంబీకులతో భోజనం చేసి, అందరూ నిద్రించాక ఇంటి ముందు గదిలో రాడ్డుకు చున్నీతో ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సాయి తండ్రి పుల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు.
మోటార్ల చోరీ కేసులో
ఏడుగురు అరెస్టు
పెనుబల్లి: పొలాల వద్ద మోటార్ల చోరీ కేసులో వీఎం బంజర్ పోలీసులు శనివారం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సర్వయ్య, ఎస్ఐ షాకీర్ వెల్లడించిన వివరాలు... గణేష్పాడు గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్, కల్లెం జగన్, రావూరి నాగేశ్వరావు, కోకిలంపాడుకు చెందిన జొన్నలగడ్డ నాగరాజు, పాత కారాయిగూడెంకు చెందిన ఎస్.కే.రఫీ, ముత్తగూడెంకు చెందిన రావూరి సల్మాన్, పెనుబల్లికి చెందిన రావూరి లక్ష్మణరావును అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.80లక్షల విలువైన ఏడు మోటార్లు, వైరును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


