డిజిటల్‌ చెరువులు ! | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెరువులు !

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

వెట్‌ల్యాండ్‌ హోదా..

జియో ఫెన్సింగ్‌ ద్వారా రక్షణ

రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా

ఖమ్మం జిల్లా ఎంపిక

అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా హద్దులు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ

రాయనిచెరువు, పుట్టకోటకు చోటు

ఖమ్మం అర్బన్‌: చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వెట్‌ల్యాండ్లను గుర్తిస్తుండగా.. రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. తొలి దశలో జిల్లాలోని 984 చెరువులను గుర్తించారు. అంతేకాక నీటిపారుదల శాఖ ద్వారా ఐదు ఎకరాలు అంతకంటే ఎక్కువ శిఖం భూమి కలిగిన 806 చెరువుల వివరాలను అటవీశాఖకు అందజేశారు. ఇందులో 606 చెరువులను వెట్‌ల్యాండ్లుగా గుర్తించేందుకు ప్రణా ళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

తుమ్మలమ్మ చెరువుతో శ్రీకారం

చింతకాని మండలం మత్కేపల్లి పరిధిలోని తుమ్మలమ్మ చెరువుకు రాష్ట్రంలోనే తొలి వెట్‌ల్యాండ్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ చెరువు సమగ్ర వివరాలను ఇప్పటికే పొందుపరిచారు. చెరువు హద్దులు, ఎఫ్‌టీఎల్‌ పరిధిని అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా డిజిటల్‌ విధానంలో నమోదు చేసి జియోఫెన్సింగ్‌ చేపట్టారు. ఈ నమూనా ఆధారంగా ఇతర చెరువుల వివరాలను సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

శాశ్వత రక్షణ.. పర్యావరణ పరిరక్షణ

వెట్‌ల్యాండ్‌గా గుర్తించిన చెరువుల పూర్తి హద్దుల వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. ముఖ్యంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిని కచ్చితంగా నిర్ధారించి అక్షాంశాలు, రేఖాంశాలతో సహా పొందుపరుస్తారు. అత్యధిక వరదల సమయంలో చెరువు నీరు విస్తరించే బ్యాక్‌వాటర్‌ / స్ప్రెడ్‌ ఏరియాను కూడా నమోదు చేస్తారు. తద్వారా భవిష్యత్‌లో ఆక్రమణలను అడ్డుకోవడంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం సులువుకానుంది. కాగా, వెట్‌ల్యాండ్‌ పరిధిలో చెరువులను కేవలం సాగునీటి వనరులుగానే కాకుండా పక్షులు, జలచరాల ఆవాసాలుగా, భూగర్భజలాల రీచార్జి కేంద్రాలుగా పరిరక్షించే చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సులుకానుందని చెబుతున్నారు.

నాలుగు శాఖల సమన్వయంతో..

వెట్‌ల్యాండ్‌ గుర్తింపు కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ, నీటిపారుదల వివరాల ఆధారంగా క్షేత్రస్థాయి సర్వే, మ్యాపింగ్‌ చేపడుతున్నారు. చెరువుల అసలు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, ఇతర హద్దులను నిర్ధారించాక డిజిటల్‌ విధానంలో నమోదు చేయడమే కాక భౌతికంగా కూడా హద్దురాళ్లు ఏర్పాటు చేస్తారు.

ఆక్రమణలకు అడ్డుకట్ట

చెరువుల భౌగోళిక పరిధిని స్పష్టంగా గుర్తించి శాశ్వత రికార్డు అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఎఫ్‌టీఎల్‌, వరద విస్తరణ ప్రాంతాల వివరాలు డిజిటల్‌గా నమోదు చేయడం వల్ల భవిష్యత్‌లో ఆక్రమణలు, అనధికార వినియోగాన్ని నిరోధించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో చెరువుల పరిరక్షణ, భూగర్భజలాల రీచార్జి, వరద నిర్వహణకు ఈ విధానం దోహదపడనుంది. అయితే, తొలి దశలో కోర్టు కేసులు, భూ వివాదాలు లేని చెరువులకు ప్రాధాన్యత ఇస్తారు. సంబంధిత శాఖల రికార్డుల ఆధారంగా జాబితా సిద్ధం చేయనున్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో తొలి దశగా బల్లేపల్లి రాయని చెరువు, పుట్టకోట చెరువులను వెట్‌ల్యాండ్‌ జాబితాలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బల్లేపల్లి రాయని చెరువు ఎఫ్‌టీఎల్‌ విస్తీర్ణం 19.42 హెక్టార్లు కాగా, సుమారు 116 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. పరిసర ప్రాంతాల్లోని బోర్లలో భూగర్భజలాల పెంపునకు కూడా ఈ చెరువు దోహదపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement