అమ్మకానికి హమాలీ పోస్టులు ! | - | Sakshi
Sakshi News home page

అమ్మకానికి హమాలీ పోస్టులు !

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

● పోస్టుకు రూ.20లక్షల నుంచి రూ.25 లక్షల డిమాండ్‌?

వైరా మద్యం డిపోలో దందా
● పోస్టుకు రూ.20లక్షల నుంచి రూ.25 లక్షల డిమాండ్‌?

వైరా: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంటుంది. కానీ హమాలీ పని కోసం ఎవరూ ఊహించని విధంగా రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు చెల్లించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతుండడం గమనార్హం. వైరాలోని ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోలో హమాలీ పని కోసం పలువురి నుంచి నగదు వసూలు చేసి నియమించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

‘ఫుల్‌’ డిమాండ్‌

వైరాలోని ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని బార్లు, వైన్స్‌కు మద్యం సరఫరా అవుతుంది. సీజన్‌తో సంబంధం లేకుండా లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ పని ఉండడం, ఏ ఒక్కసీసా పక్కదారి పట్టించి ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకున్నా లాభం సొంతమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉండడంతో డిపోలో హమాలీ పని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతుంటారు. గతంలోనూ పలువురు రూ.లక్షల్లో చెల్లించి మరీ హమాలీలుగా చేరినట్లు ప్రచారం జరిగింది. ఇక నెల క్రితం కూడా ఆరుగురి నుంచి రూ.1.50కోట్ల మేర వసూలు చేసి హమాలీలుగా నియమించినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం... భారీ స్థాయిలో వసూళ్లు జరిగినా డిపో అధికారులు పట్టనట్లు వ్యవహరించడం అనుమానాలు తావిస్తోంది.

నిబంధనలను పక్కన పెట్టి...

ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోలో హమాలీలను నియమించాలంటే అదనపు కలెక్టర్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, కార్మిక శాఖ అధికారి పర్యవేక్షణ అవసరం. లేదంటే స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో వారిని నిబంధనలకు అనుగుణంగా నియమించుకోవచ్చు. ఇవేమీ లేకుండా డిపోలో ఆరుగురిని హమాలీలను నియమించడం చర్చనీయాంశంగా మారింది. మద్యం డిపోలో హమాలీ పోస్టులు బహిరంగంగా అమ్ముకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూడగా ఎవరూ నోరెత్తడం లేదు.

పనిభారం పెరగడంతోనే..

ప్రస్తుతం 50మంది హమాలీలు ఉన్నా కొత్త వారిని తీసుకోవడంపై మద్యం డిపో మేనేజర్‌ రమేష్‌ను వివరణ కోరగా... హమాలీల నియామకం వాస్తవమేనని అంగీకరించారు. అయితే, పని భారం పెరగడంతో కొత్త వారిని రోజువారీ ప్రతిపాదికన తీసుకున్నామే తప్ప, వసూళ్ల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. అయినప్పటికీ ఈ విషయమై విచారణ చేపడతామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement