మధిర/బోనకల్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శని, ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి శని వారం సాయంత్రం బయలుదేరనున్న ఆయన రాత్రి 7గంటలకు బోనకల్ చేరుకుని పార్టీ బీఎల్‌ఏలు, ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఆదివారం ఉదయం 10–30గంటలకు చింతకాని మండలం కొదుమూరు ఎస్సీ కాలనీలో రహదారులకు, ఆతర్వాత లచ్చుగూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, నాగిలిగొండ తదితర గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, మధ్యాహ్నం నారాయణపురం, మోటమర్రిలో పీఏఎస్‌సీల ఆధ్వర్యాన నిర్మించిన గోదాంలను ప్రారంభిస్తారు. అంతేకాక పలు గ్రామాల్లో అంతర్గత, ప్రధాన రహదారుల నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేయనున్నారు.
నేడు, 31న మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 6గంటలకు ఖమ్మం చేరుకోనున్న మంత్రి, 42వ డివిజన్ నిజాంపేటలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, 31వ తేదీ సోమవారం ఉద యం ఖమ్మం 29వ డివిజన్ ప్రకాశ్‌నగర్‌లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అసోసియేట్ ప్రొఫెసర్‌కు ధ్యాన్‌చంద్ అవార్డు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ భట్టు వెంకన్న రాష్ట్రస్థాయి ధ్యాన్‌చంద్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు ప్రకటించగా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ చేతుల మీదుగా ఆయన శనివారం అవార్డు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా వెంకన్నను కాలేజీ ప్రిన్సిపాల్ మహ్మద్ జాకీరుల్లా, అధ్యాపకులు అభినందించారు.
3న డాక్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలపై ఫిర్యాదు ల పరిష్కారానికి సెప్టెంబర్ 3న డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. తపాలా సేవలు, సిబ్బంది అంశాలకు సంబంధించి సమస్యలు ఉంటే ‘డాక్ అదాలత్, సూపరింటెండెంట్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం–507003’ చిరునామాకు 1వ తేదీలో గా చేరేలా లేఖ పంపించాలని సూచించారు. లేఖలో ఫోన్ నంబర్, ఈ–మెయిల్ పొందుపరిస్తే, 3వ తేదీన గూగుల్ మీట్ ద్వారా చర్చిస్తామని సూపరింటెండెంట్ ఓ ప్రకటనలో తెలిపారు.
డ్రైవర్ ఉద్యోగాలకు
దరఖాస్తులు
ఖమ్మం వైద్యవిభాగం: ఈఎమ్‌ఆర్‌ఐ 108, 102, 1962 వాహనాల్లో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ తెలిపారు. పదో తరగతి పాసై 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీ నంబర్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. ఖమ్మం, ముదిగొండ, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి, వైరా సెంటర్లలో ఖాళీలు ఉండగా, ఆసక్తి, అర్హత కలిగిన వారు శనివారం ఉదయం 10గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో మొదలయ్యే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకురావాలని, వివరాలకు 91549 18117 నంబర్‌లో సంప్రదించాలని ఆయన తెలిపారు.
పలువురు ఎస్‌ఐల బదిలీ
ఖమ్మంక్రైం: జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఎం బంజర ఎస్‌ఐ కె.వెంకటేష్‌ను ఖమ్మం ఖానాపురం హవేలీ ఎస్‌ఐగా, అక్కడి ఎస్‌ఐ మధుబాబును మహబూబాబాద్ జిల్లాకు బది లీ చేశారు. అలాగే, వీఆర్‌లో ఉన్న పి.ప్రదీప్‌ను వేంసూరుకు కేటాయించగా, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఎస్‌ఐ షేక్ షకీర్‌ను వీఎం బంజర్ ఎస్‌ఐగా నియమించారు.


