ఇంటర్ విద్యార్థులకు తొలిసారి
ఇప్పటికే జిల్లాకు చేరిన క్లాత్
3,095 మంది విద్యార్థులకు లబ్ధి
కుట్టే పనులు మొదలయ్యాయి..
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు పాఠశాలల స్థాయి విద్యార్థులకే యూనిఫామ్ సమకూరుస్తోంది. ఈసారి కొత్తగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు సైతం యూనిఫామ్ అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 3,095మంది విద్యార్థినీ, విద్యార్థులకు లబ్ధి జరగనుంది.
తేడా ఉండకుండా..
ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్ విద్యార్థులకు అందజేస్తుండడంతో అందరూ ఒకే రకమైన దుస్తుల్లో వస్తున్నారు. అదే కాలేజీలకు వచ్చేసరికి యూనిఫామ్ లేకపోవడంతో ఒక్కో రంగు దుస్తులు ధరిస్తున్నారు. దీంతో విద్యార్థుల నడుమ తారతమ్యాలు ఉండొద్దనే భావనతో ప్రభుత్వం యూనిఫామ్ పంపిణీకి నిర్ణయించినట్లు తెలిసింది.
ఎంఈఓల ద్వారా పర్యవేక్షణ
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ రంగుల్లో మార్పులు చేశారు. నీలి రంగు చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్‌తో యూనిఫామ్ ఇస్తున్నారు. ఇదేరంగు యూనిఫామ్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా ఇవ్వనుండగా, ఇప్పటికే జిల్లాకు క్లాత్ చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా బృందాలకు యూనిఫామ్ కుట్టే పనులు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎంఈఓలకు అప్పగించి వారి ద్వారా కాలేజీలకు చేరవేస్తారు. ఇప్పటికే క్లాత్ జిల్లాకు చేరినందున కుట్టే పనులు మొదలుపెట్టడంతో లోపాలు ఎదురుకాకుండా పర్యవేక్షించాలని డీఆర్‌డీఓ శ్రీరామ్ ఇప్పటికే క్షేత్రస్థాయి ఉద్యోగులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు సైతం యూనిఫామ్ అందించనుంది. ఇప్పటికే జిల్లాకు అవసరమైన క్లాత్ చేరింది. డీఆర్‌డీఓ శ్రీరామ్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. త్వరలోనే విద్యార్థులకు యూనిఫామ్ అందే అవకాశముంది.
– కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి


