‘22ఏ’ జాబితా పరిష్కారంలో పారదర్శకత | - | Sakshi
Sakshi News home page

‘22ఏ’ జాబితా పరిష్కారంలో పారదర్శకత

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

● ప్రైవేట్‌ భూములు ఉంటే 48 గంటల్లో తొలగింపు ● తహసీల్దార్లు, ఉద్యోగులతో సమీక్షలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

● ప్రైవేట్‌ భూములు ఉంటే 48 గంటల్లో తొలగింపు ● తహసీల్దార్లు, ఉద్యోగులతో సమీక్షలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

ఖమ్మం సహకారనగర్‌: 22ఏ నిషేధిత జాబితాలో నమోదైన భూముల సమస్య పరిష్కారంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాబితాలో ఉన్న ప్రతీ సర్వే నంబర్‌ను రెవెన్యూ రికార్డుల ఆధారంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నిర్ధారించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ సమయాన కొన్ని భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోందని.. ఆ ఫిర్యాదులు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు చేరగానే పరిశీలించి నివేదిక సమర్పించాలని తెలిపారు. అంతేకాక 22ఏ భూముల పరిశీలన, నమోదు, తొలగింపు కోసం జిల్లావ్యాప్తంగా ఒకే నమూనా అమలుచేయాలని స్పష్టం చేశారు. కొన్నిసందర్భాల్లో ప్రైవేట్‌ భూములు పొరపాటుగా 22ఏ జాబితాలో చేరితే నిబంధనల ప్రకారం 48 గంటల్లోగా పరిష్కరించాలని సూచించారు. అంతేకాక సర్వే నంబర్ల వారీగా పాత, కొత్త జాబితాలు పరిశీలించి 22ఏ జాబితాలో చేరడానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ తెలిపారు.

తొలగింపులకు ప్రత్యేక విధానం

ప్రైవేట్‌ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు తేలితే... తొలగించేందుకు సర్వే నంబర్‌ వారీగా జాబితా రూపొందించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కలెక్టర్‌ సూచించారు. 22ఏ జాబితాలో భూములను చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపులోనూ పాటించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

రీ–సర్వే వివరాలు నమోదులో అప్రమత్తత

కూసుమంచి మండలం భగత్‌వీడు గ్రామంలో చేపడుతున్న భూముల రీ–సర్వే వివరాలను ఆన్‌లైన్‌ చేసే క్రమాన పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామపంచాయతీ ఉద్యోగులకు కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని తప్పులు లేకుండా ఆన్‌లైన్‌ చేయాలని, రెండు దశల డేటాను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. డేటా ఎంట్రీ లాగిన్‌ కేవలం వివరాలు నమోదుకే వినియోగిస్తూ, ఫ్రీజింగ్‌, కన్ఫర్మేషన్‌ ఆప్షన్లు తహసీల్దార్‌ లాగిన్‌లో చేయాలని సూచించారు. ఎకరాలు, గుంటల వివరాలను నమోదు చేసే సమయాన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గుంటల కొలత 40కు మించకుండా చూస్తూ, అంతకు మించిన కొలతను తదుపరి ఎకరాగా పరిగణించాలని సూచించారు. కూసుమంచి తహసీల్దార్‌ సైదులు, డీటీ ఖాజా మొహిద్దీన్‌, సర్వేయర్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement