అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

Jul 30 2026 12:27 AM | Updated on Jul 30 2026 12:27 AM

● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ఎల్‌నినో నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలే మేలు

● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ఎల్‌నినో నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలే మేలు

తిరుమలాయపాలెం: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సమపాళ్లలో జరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇదే సమయాన పేదలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా అర్హులందరికీ మంజూరు చేస్తున్నామని తెలిపారు. తిరుమలాయపాలెంలో మండలం తిమ్మక్కపేటలో అంబేద్కర్‌ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించిన మంత్రి, పాపాయిగూడెంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక మేడిదపల్లిలో సర్పంచ్‌ మోర అనిల్‌రెడ్డి తన తండ్రి రామలింగారెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన బస్‌ షెల్టర్‌ను ప్రారంభించారు. అలాగే, జూపెడలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి మంత్రి హాజరయ్యారు.

పేదలందరికీ ఇళ్లు

తిరమలాయపాలెం మండల పర్యటనలో భాగంగా జరిగిన సమావేశాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్‌ ఆశయాల సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నందున రైతులు వరి తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు. అంతేకాక పొలాల్లో పంట కుంటలు, ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఆర్‌డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌, ఎంపీడీఓ ఎస్‌.కే.సిలార్‌ సాహెబ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ చావా శివరామకృష్ణ, నాయకులు, సర్పంచ్‌లు రామసహాయం నరేష్‌రెడ్డి, కొప్పుల అశోక్‌, బెల్లం శ్రీనివాస్‌, వనవాసం నరేందర్‌రెడ్డి, గుమ్మడి దేవభిక్షం, రేపాకుల సుభద్ర, ఉన్నం రాజేశేఖర్‌, నల్లమల్ల ప్రతాప్‌, నంద్యాల శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు హాస్టల్‌ మంజూరు చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి సునీల్‌ ఆధ్వర్యాన మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement