కనికట్టు! | - | Sakshi
Sakshi News home page

కనికట్టు!

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

పీఎంఈజీపీ రుణాల్లో మాయాజాలం

పాత షాపునకే కొత్త ఫ్లెక్సీ పెట్టి సబ్సిడీ రుణం స్వాహా

దాటవేత ధోరణిలో

అధికారుల సమాధానాలు

లేనిది ఉన్నట్టు..

‘చేపల చెరువు కోసం రుణం,

అనుమతులు కావాలని ఓ వ్యక్తి

సంప్రదిస్తే ఏ దశలోనూ అధికారులు తనిఖీ చేయకుండానే మంజూరు చేస్తారు.. ఆ తర్వాత చోరీకి

గురైందని రుణగ్రహీత ఫిర్యాదు

చేయడంతో చెరువు ఎక్కడ ఉందని ఆరా తీస్తే లేకపోగా అధికారుల

డొల్లతనం బయటపడుతుంది..’

కొన్నేళ్ల క్రితం విడుదలైన ఓ సినిమా వృత్తాంతం ఇది! అచ్చు ఇలాగే యూనిట్‌ లేకుండానే సబ్సిడీ రుణం తీసుకున్న ఘటన జిల్లాలో వెలుగు చూసింది. ఈ విషయంలో ఎవరిని ప్రశ్నించినా పొంతన లేని సమాధానాలు చెబుతుండగా.. దీని వెనకా ఎందరు ఉన్నారో తేలాల్సి ఉంది.

– సాక్షి ప్రతినిధి, ఖమ్మం / సత్తుపల్లి

నాలుగేళ్ల క్రితం

2022లో ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) పథకాన్ని అమలుచేశారు. ఇందులో భాగంగా వ్యాపార యూనిట్లకు రుణాలు మంజూరు చేశారు. అయితే, యూనిట్‌ స్థాపించే సమయాన బ్యాంకు అధికారులతో పాటు మండల పరిషత్‌ అధికారులు, విజిలెన్స్‌ కమిటీ పరిశీలించి ఇచ్చే నివేదిక ఆధారంగా రుణం మంజూరవుతుంది. కానీ యూనిట్‌ పెట్టకుండానే అప్పటికే ఉన్న యూనిట్‌ వద్ద ఫ్లెక్సీ మార్చి ఫొటో దిగి రాజకీయ పలుకుబడితో రుణం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్‌ఓసీ తీసుకునేలా యత్నాలు

యూనిట్‌కు సబ్సిడీ మంజూరు చేయాలంటే సంబంధిత బ్యాంక్‌ థర్డ్‌పార్టీ ద్వారా విచారణ చేయిస్తుంది. ఈసారి జియోట్యాగింగ్‌ చేయాల్సిన బాధ్యత పోస్టల్‌ శాఖకు అప్పగించారు. దీంతో పోస్టల్‌ శాఖ ఎన్‌ఓసీ ఇస్తేనే సబ్సిడీ మొత్తం రుణ గ్రహీత ఖాతాలో జమ కానుండగా.. లబ్ధిదారులు అవేమీ లేకుండానే సబ్సిడీని కాజేసే యత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే అసలు టెంట్‌హౌస్‌ యజమాని బొలుసుపాటి చందరరావు మాత్రం తనకు చెప్పకుండానే షాప్‌ ఫ్లెక్సీ మార్చి అధికారులకు చూపించారని చెబుతూ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం.

ఫిర్యాదులు వచ్చాయి.. విచారణ చేస్తాం

సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన బాలాజీ టెంట్‌హౌస్‌ పేరిట రుణం మంజూరుపై డీసీసీబీ సీఈఓ వెంకటఆదిత్య వివరణ కోరగా.. ‘ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. వాస్తవానికి థర్డ్‌పార్టీ నివేదిక ఆధారంగా సబ్సిడీ విడుదల చేస్తాం. ఇందులో బ్యాంకు పాత్ర నామమాత్రమే.’అని తెలిపారు. ఇక విచారణ పోస్టల్‌ అధికారి రాజేశ్‌ను ఆరా తీయగా.. ‘ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకై తే ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ జారీ చేయలేదు’అని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement