చనిపోయినా పింఛన్లు!? | - | Sakshi
Sakshi News home page

చనిపోయినా పింఛన్లు!?

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

● జాబితాలో 6,100 మంది ఉన్నట్లు గుర్తింపు ● జిల్లాలో 100 శాతం పూర్తయిన ‘లైవ్‌ అథెంటికేషన్‌’ ● అనర్హుల స్థానంలో పేదలకు పింఛన్లు ఇచ్చే అవకాశం

జిల్లాలో చేయూత పెన్షన్‌దారులు

● జాబితాలో 6,100 మంది ఉన్నట్లు గుర్తింపు ● జిల్లాలో 100 శాతం పూర్తయిన ‘లైవ్‌ అథెంటికేషన్‌’ ● అనర్హుల స్థానంలో పేదలకు పింఛన్లు ఇచ్చే అవకాశం

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలో ‘చేయూత’పెన్షన్ల లబ్ధిదారుల లైవ్‌ అథెంటికేషన్‌ (ధ్రువీకరణ) ప్రక్రియ ముగిసింది. నకిలీ, అనర్హుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌ వంద శాతం పూర్తయింది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సిబ్బంది చేపట్టిన లైవ్‌ అథెంటికేషన్‌లో మృతి చెందిన లబ్ధిదారులను గుర్తించారు. ఈ క్రమాన పింఛన్ల జాబితాలో 6,100 మంది మృతులు ఉన్నట్లు తేల్చారు. కాగా, రాష్ట్రమంతటా ధ్రువీకరణ పూర్తయ్యాక ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కేఎంసీలో అత్యధికంగా లబ్ధిదారులు

జిల్లావ్యాప్తంగా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే అత్యధికంగా లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా మొత్తం 1,76,477 మంది పెన్షన్‌ దారులు ఉండగా, అందులో 1,59,696 మంది విజయవంతంగా అథెంటికేషన్‌ పూర్తి చేసుకున్నారు. ఒక్క ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనే 26,073 మందికి 21,056 మంది అర్హులుగా తేలారు. తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లో సైతం లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంది.

6,100 మంది మృతి..

ఈ లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ ద్వారా అనర్హులు, పలు కారణాల వల్ల పెన్షన్‌ తీసుకోని వారి వివరాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. పెన్షన్‌ పొందుతూ ఇప్పటికే 6,100 మంది లబ్ధిదారులు పలు కారణాలతో మరణించినట్లు అధికారులు గుర్తించారు. అయితే, వీరు ఎన్నాళ్ల క్రితం మృతి చెందారు, అప్పటి నుంచి పింఛన్‌ మంజూరవుతోందా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా, అత్యధికంగా కల్లూరులో 521 మంది, ఖమ్మం కార్పొరేషన్‌లో 399 మంది మృతి చెందారు. అంతేకాక జిల్లాలో సుమారు 6,879 మంది లబ్ధిదారులు అందుబాటులో లేరని తేలింది. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోనే 4,345 మంది లబ్ధిదారుల చిరునామా లభ్యం కాలేదు. వేలిముద్రలు / ముఖ గుర్తింపు నమోదు కాని వారు 1,963 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు 498 మంది, పెన్షన్‌ పట్ల ఆసక్తి చూపని వారు 130 మంది ఉన్నట్లు బయటపడింది.

అర్హుల ఎదురుచూపులు

జిల్లాలో పెన్షన్ల ధ్రువీకరణ ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి రావడంతో, కొత్త పెన్షన్ల మంజూరుపై ఉత్కంఠ నెలకొంది. అర్హత ఉండి కూడా కొన్నేళ్లుగా పెన్షన్లు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సుమారు 25 వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలు తమకు పెన్షన్‌ ఎప్పుడు అందుతుందంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు

ఇదిలా ఉండగా, అర్హులైన పేదలకు మరింత ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతో, మరణించిన వారి స్థానంలో అలాగే అనర్హుల స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న నిజమైన లబ్ధిదారులకు త్వరలోనే లబ్ధి చేకూరనుందనే ప్రచారం జరుగుతోంది.

మొత్తం లబ్ధిదారులు 1,76,477

ధ్రువీకరణ విజయవంతం అయిన వారు 1,59,696

మృతుల సంఖ్య 6,100

చిరునామా లేని వారు 6,879

ఫింగర్‌, ఫేస్‌ క్యాప్చర్‌ కానివారు 1,963

గుర్తించలేని మానసిక దివ్యాంగులు 123

తప్పుడు ఆధార్‌ ఉన్న వారు 81

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు 498

పెన్షన్‌ తీసుకునేందుకు ఇష్టపడని వారు 130

ఆధార్‌తో ఇతర సమస్యలు ఉన్న వారు 738

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement