● 27నుంచి 29 వరకు ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళాలు ● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ పాఠశాలల విద్యార్థులందరికీ ఆగస్టు 30 నాటికి రెండు జతల యూనిఫామ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి పలు శాఖల అధికారులతో కలిసి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యాన పంటల వైవిధ్యీకరణను ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు సాగైన వరి కాకుండా మిగతా భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇందుకోసం 27 నుంచి 29 వరకు రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సెర్ప్ సీఈఓ దివ్య మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో సమావేశమై యూనిఫాం తయారీ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
ఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల కట్టడికి అన్ని శాఖలు అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పోలీస్, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. గుర్తించిన బ్లాక్‌స్పాట్లలో రోడ్డు భద్రత పనులు పూర్తిచేయాలని తెలిపారు. వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్లకే పరిమితం కాకుండా ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. ఇక నుంచి ప్రతీ నెల మూడో శుక్రవారం రోడ్డు భద్రతా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఖమ్మం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, ఏదులాపురం, వైరాల్లో వీధి వ్యాపారాలకు రెడ్‌జోన్లను గుర్తించి అక్కడ వీధి వ్యాపారాలను అనుమతించొద్దని ఆదేశించారు.
తాగునీటి సమస్య రాకుండా కార్యాచరణ
ఎల్‌నినో దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ దివాకర సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. గ్రామాల వారీగా తాగునీటి సరఫరాపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. సర్పంచ్‌లు, వార్డ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై తాగు, సాగునీటి పొదుపు ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశాల్లో శిక్షణ సహాయ కలెక్టర్ పారస్‌కుమార్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పలు శాఖల అధికారులు సదానందం, రామారావు, శ్రీరామ్, పుల్లయ్య, సీహెచ్ రామ్మూర్తి, దివ్య, హరిబాబు, ఎం.వెంకటేశ్వర్లు, శేఖర్‌రెడ్డి, శ్రీనివాసాచారి, జిల్లా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


