ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా క్రీడాకారులు మెరుగైన స్థానాల్లో నిలిచారు. అండర్–11 బాలికల విభాగంలో బి.హార్విక లక్ష్మి 14వ ర్యాంక్ సాధించగా, పి.ఆరాధ్య 17వ ర్యాంక్, టి.రోస్మి త 27వ ర్యాంక్, అండర్–13లో బి.సాయి శివాని 18వ ర్యాంక్, అండర్–17లో జి.సిరి 22 వ ర్యాంక్, అండర్–19లో జి.సిరి 16వ ర్యాంక్, బి.సాయిశివాని 22వ ర్యాంక్ సాధించారు. ఇక బాలుర విభాగం అండర్–11 లో ఏ.యశ్వంత్ 23వ ర్యాంక్, అండర్–13 ఈ.హరి 22వ ర్యాంక్, అండర్–19లో పి.జ్వలిత్ 23, ఈ.హరి 29వ ర్యాంక్ సాధించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని అకాడమీలో శిక్షణ పొందుతున్న బాలబాలికలు ర్యాకింగ్స్‌లో సత్తా చాటడంపై డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ వీ.వీ.ఎస్.మూర్తి అభినందించారు.
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: జిల్లాకు 114 పూర్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు కాగా, అందులో తాత్కాలిక పద్ధతిపై ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్, ఆయాలైతే ఏడో తరగతి విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు. వయో పరిమితిని 18 – 44ఏళ్లుగా నిర్ణయించినప్పటికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని తెలిపారు. అయితే, దరఖాస్తుదారులు పాఠశాల పరిధి నివాస ప్రాంతం, గ్రామపంచాయతీ, అదే మండలం అయి ఉండాలని వెల్లడించారు. ఆసక్తి, అర్హతలు కలిగిన వారు ఈనెల 8, 9వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై 10వ తేదీన మండల కమిటీ, 11వ తేదీన ఆర్‌డీఓ, సబ్ కలెక్టర్ స్థాయిలో పరిశీలన అనంతరం నియామకాలు పూర్తిచేస్తామని డీఈఓ తెలిపారు.
బీపీఈడీ ఎంట్రెన్స్‌లో
రాష్ట్రస్థాయి ర్యాంకులు
కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) ఎంట్రన్స్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఎం.శిరీష రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించగా, డి.ఉమ 243, బి.అఖిల 396, పి.ఇందు 447, టి.ప్రమీల 592, కె.సౌమ్య 1,013వ ర్యాంకు సాధించారు. ఆయా విద్యార్థినులను ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, పీడీ బి.రమ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ కే.పీ.ఐశ్వర్య, దీప్తి, ఎం.నవ్య అభినందించారు.
ఘనంగా నదీ హారతి..
భద్రాచలం: పవిత్ర గోదావరి తీరంలో నిర్వహించిన నదీ హారతి నయనానందకరంగా సాగింది. గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమ నిర్వహకులు రామవజ్జుల రవికుమార్ బహుళ సప్తమి నదీ హారతి విశిష్టతను వివరించారు. గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించారు. పూజా ద్రవ్యాలతో రామయ్యకు, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, కృష్ణ శర్మ, తేజ శర్మ పాల్గొన్నారు.
అన్విత ఫ్రాంచైజ్‌కు ఉమ్మడి జిల్లావాసులు
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న తెలంగాణ టీ–20 క్రికెట్‌కు అన్విత గ్రూప్ ఫ్రాంచైజ్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. జిల్లా నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం కుమారుడు సహేంద్ర మల్లు, బి.విశాల్, అజ హర్, దివిన్, నారాయణతేజ్ ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న టీ–20 లీగ్‌లో సంబంధిత జట్టు తరఫున ఆడనున్నారు. జిల్లా నుంచి జూనియర్ క్రికెటర్లు ఎంపికకావడంపై సీనియర్ క్రికెటర్లు అభినందనలు తెలిపారు.


