ఖమ్మంక్రైం: ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా.. అనారోగ్యంతో బాధపడుతూ రెండు వారాల క్రితం మృతి చెందిన రిటైర్డ్ ఏఆర్ ఎస్‌ఐ మైసయ్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. మైసయ్యతో పాటే అనారోగ్యానికి గురైన ఆయన భార్య భాగ్యమ్మ మృతి చెందింది. ఆరోగ్యం విషమించడమే కాక భర్త మృతి చెందినట్లు తెలియడంతో ఆమె మృతి చెందగా గురువారం మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చారు. మైసయ్య మృతి చెందిన మరుసటిరోజు ప్రభుత్వం బకాయిల్లో కొంత మేర విడుదల చేసిన విషయం విదితమే. కాగా, భాగ్యమ్మ మృతదేహం వద్ద విశ్రాంత పోలీసు అధికారుల సంఘం బాధ్యులు నివాళులర్పించి మాట్లాడారు. మైసయ్య దంపతుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వీరి పెద్దకుమారుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నందున వైద్యానికి నెలకు రూ.20వేలు ఖర్చవుతోందని తెలిపారు. ఆయనకు ప్రభుత్వం ఉద్యోగంతో పాటు తండ్రి పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణమూర్తి, రుద్ర వెంకటనారాయణతో పాటు ప్రతాప్‌రెడ్డి, బి.రాజారావు, ప్రసాదరావు, దామోదర్‌రావు, కిషోర్‌బాబు, ప్రభాకర్ పాల్గొన్నారు.
బకాయిల్లో జాప్యంతో ఇటీవల భర్త మృతి,
ప్రస్తుతం భార్య కన్నుమూత


